
తాగుబోతులు తలుపులు కొడుతున్నారు
►కారప్పచ్చడి పెట్టాలంటూ కేకలు వేస్తున్నారు
►మద్యం రాయుళ్లతో మనశ్శాంతి కరవైంది
►మా కాలనీల్లో మద్యం దుకాణాల్ని తొలగించండి
►అధికారులకు బాధితుల వేడుకోలు
►కలెక్టరేట్ వద్ద మహిళల ధర్నా
ఒంగోలు టౌన్: ‘ఇళ్లల్లో పడుకొని ఉంటే మందు తాగినోళ్లు పెద్దగా కేకలు పెడుతూ తలుపులు దబాదబా కొడుతున్నారు. వారి గోల భరించలేక తలుపులు తెరిస్తే.. కారం పచ్చడి పెట్టాలంటూ దబాయిస్తున్నారు. నీళ్లు కావాలంటూ గోల చేస్తున్నారు. కాదంటే ఏం చేస్తారోనన్న భయంతో పెడుతున్నాం. ఒకరిని చూసి మరొకరు పగలు, రాత్రి తేడాలేకుండా ఇలా ఇళ్ల పైబడి తలుపులు కొడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు’ అని వలేటివారిపాలెం మండలం పోకూరు, మద్దిపాడు గ్రామాలకు చెందిన మహిళలు వాపోయారు. వారం రోజుల క్రితం ఏర్పాటు తమ కాలనీల్లో చేసిన మద్యం దుకాణాల్ని తొలగించాలని కోరుతూ ఆయా గ్రామాల ఎస్సీ, బీసీ కాలనీల మహిళలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రహదారుల పక్క నుంచి జనావాసాల్లోకి వచ్చిన మద్యం దుకాణాలతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు వీరి ఆందోళన అద్దం పట్టింది.
పోకూరు బీసీ కాలనీకి చెందిన మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. పోకూరు గ్రామం వారం రోజుల కిందటి వరకు ప్రశాంతంగా ఉండేది. మద్యం దుకాణాలు హైవేలకు 500 మీటర్ల దూరంలో ఉండాలనే సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం అవన్నీ జనావాసాల్లోకి వచ్చి చేరాయి. ఈక్రమంలో పోకూరు బీసీ కాలనీలో జనావాసాల మధ్య ఓ మద్యం దుకాణం ఏర్పాటైంది. దీంతో ఇక పగలు, రాత్రి తేడా లేకుండా మందు తాగినోళ్లు రోడ్లపైకి చేరి అరుపులు, కేకలతో నానా రభస చేస్తున్నారు. కొంతమంది ఆటోలు, బండ్లపై వచ్చి కొత్తగా ఇక్కడ మద్యం దుకాణం ఎక్కడ పెట్టారంటూ ఇళ్లలో వారిని పిలిచి మరీ విచారిస్తున్నారు. ఈ దుకాణం సమీపంలో వాటర్ ప్లాంటుతోపాటు అంకమ్మ తల్లి గుడి, చర్చి ఉంది. మహిళలు బహిర్భూమికి అటువైపుగా వెళ్తుంటారు. మద్యం రాయుళ్లకు భయపడి పగలు అటువైపుగా వెళ్లాలంటేనే మహిళలు, బాలికలు భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఇబ్బందులు భరించలేని కాలనీకి చెందిన మహిళలు సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో మద్యం దుకాణం తొలగించాలని వేడుకున్నారు.