వ్యక్తి దారుణహత్య
బనగానపల్లె రూరల్: రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఆపతి నారాయణస్వామి(42) మంగళవారం హత్యకు గురయ్యాడు. పలుకూరు దేవనగర్ కాలనీ సమీపలో ఆయనను బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. స్థానికుల కథనం మేరకు.. నాపరాయి డిపోలో గుమాస్తాగా పనిచేసే ఆపతి నారాయణస్వామికి పేకాట, మద్యం ఇతర దురలవాట్లున్నాయి. నారాయణ స్వామి అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురితో కలిసి పేకాట ఆడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సాయంత్రం పలుకూరులో నలుగురూ మద్యం సేవించి మత్తులో గొడవ పడ్డారు. అనంతరం రామక్రిష్ణాపురం గ్రామానికి బైక్‌లపై బయల్దేరారు.
దేవనగర్ సమీపంలో అందరూ ఆగి మళ్లీ ఘర్షణ పడ్డారు. ఆపతి నారాయణస్వామిని మిగతా ముగ్గురు బండరాయితో బాది దారుణంగా హత్య చేశారు. పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ హనుమంతరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.