త్రిమూర్తులు.. వీళ్లు సామాన్యులు కాదు | worst fallows in sports field | Sakshi
Sakshi News home page

త్రిమూర్తులు.. వీళ్లు సామాన్యులు కాదు

Published Fri, Sep 8 2017 11:13 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

త్రిమూర్తులు.. వీళ్లు సామాన్యులు కాదు - Sakshi

త్రిమూర్తులు.. వీళ్లు సామాన్యులు కాదు

క్రీడా లోకంలో చీడపురుగులు
- డిగ్రీలతో సంబంధం లేని పదవులు
- ఎదురులేని పెద్ద మనుషుల ఆట
- ఓ ప్రధాన క్రీడా సంస్థ కేంద్రంగా కార్యకలాపాలు
- తాజాగా నకిలీ క్రీడా ధ్రువీకరణ పత్రాల కలకలం
- రాష్ట్ర స్థాయి పదవులతో అక్రమాలు


జిల్లా క్రీడా రంగం ఆ ముగ్గురి చెప్పుచేతల్లో నలుగుతోంది. ఈ విభాగంలోని లొసుగుల ఆధారంగా వీరు చక్రం తిప్పుతున్నారు. వీరికున్న డిగ్రీలకు.. ఎంచుకున్న క్రీడలకు పొంతన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయ నాయకుల అండ తోడు కావడంతో ఇక్కడ వీరు ఆడించిందే ‘ఆట’. చివరకు.. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే స్థాయికి ఎదిగిన తీరు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. తాజాగా ఎంబీబీఎస్‌లో నకిలీ క్రీడా ధ్రువీకరణ పత్రాలు వెలుగులోకి రావడంతో ఈ త్రిమూర్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌: ఒకరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.. మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఇంకొకరు కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగి. కొన్నేళ్ల క్రితం కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని.. ఇప్పుడు ఈ ముగ్గురూ ఏకంగా జిల్లా క్రీడా రంగాన్ని శాసిస్తున్నారు. ఏ చెట్టూలేని చోట ఆముదం మొక్కే మహావృక్షమన్నట్లు.. గతంలో అర్హులు లేరనే కారణం చూపి వీరు ఎంచుకున్న క్రీడ క్రమంగా దాసోహమైంది. ప్రస్తుతం ఆయా క్రీడాంశాల్లో వీరు చేసిందే శాసనంగా మారింది. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో వీరి పంట పండింది. రాష్ట్ర స్థాయి కేడర్‌లో తమ స్థానం పదిలపర్చుకోవడంతో జిల్లాలో వీరి ప్రాబల్యానికి ఎదురులేకుండా పోయింది.

బతుకు.. ఆట
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో కెరీర్‌ను ప్రారంభించిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో బుడోకాన్‌ శిక్షణ పొందాడు. తిరిగి జిల్లాకు చేరిన తర్వాత పీటీసీలో పని చేస్తున్న ఓ ఉద్యోగి వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోగా ఈ వ్యక్తి అక్కడ మకాం వేశాడు. అక్కడ ఉద్యోగులకు శిక్షణనిచ్చేందుకు తన తరపున మరొకరిని నియమించాడు. అతని వెనుక తనే ఉన్నట్లు ప్రచారం చేసుకొని కెరీర్‌ను మలుపు తిప్పుకున్నాడు. ఇక అక్కడి నుంచి తన దృష్టి క్రీడల వైపునకు మళ్లింది. సిలంబం.. కలరీ అనే క్రీడాంశాలకు సంబంధించిన జట్ల ఎంపికకు తానే బాస్‌గా చెప్పుకున్నాడు.

ఈ కోవలోనే హైదరాబాద్‌లో యుద్ధకళకు సంబంధించిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అప్పట్లో జిల్లా కార్యదర్శిగా ఉంటూ.. ఆ తర్వాత రాష్ట్ర జాయింట్‌ కార్యదర్శిగా ఎదిగాడు. అనంతరం రాష్ట్ర విభజన కలిసి రావడంతో రాష్ట్ర కార్యదర్శి పోస్టును సొంతం చేసుకున్నాడు. ఇతనిలో మరో కళ కూడా దాగుంది. బాబా అవతారం ఎత్తి మరో ఇద్దరిని తోడు చేసుకున్నాడు. జిల్లా శివారులోని బాలప్పకోన అడవుల్లో క్షుద్రపూజలు చేస్తున్నాడు. జాతకాలు.. హోమాల పేరిట ఉన్నతాధికారులను సైతం బురిడీ కొట్టించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. పేరులోని అక్షర క్రమంలో మార్పులు చేసుకుంటే బతుకు రేఖ ఎక్కడికో వెళ్లిపోతుందంటూ నమ్మబలకడంతో ఆయనకు ఆయనే సాటి.

అకాడమీకే ప్రాధాన్యం
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనకు ప్రావీణ్యం ఉన్న క్రీడలో చక్రం తిప్పుతున్నాడు. మొదట జిల్లా సంఘంలో ఓ పదవి చెప్పట్టి.. ఆ తర్వాత అదే క్రీడలో రాష్ట్ర కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నకిలీ క్రీడా ధ్రువీకరణ పత్రాల జారీలో సిద్ధహస్తునిగా పేరొందాడు. రాష్ట్రంలో జరిగే ప్రతి టోర్నీకి ఇతనే కీలకంగా మారడంతో ఆ ప్రగతి ఆధారంగా జిల్లాలో ప్రధానమైన క్రీడా సంస్థలో పాగా వేశాడు. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూనే సొంతంగా అకాడమీ ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పని చేస్తున్న పాఠశాలకు శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధి వెళ్లగా.. రెండు రోజులుగా పాఠశాలకు రావడం లేదనే విషయం వెల్లడయింది. సార్‌.. ఎందుకు రాలేదని అక్కడున్న ఉద్యోగులను ప్రశ్నించగా జిల్లా కేంద్రంలో బిజీగా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. అటెండెన్స్‌ రిజిస్టర్‌లో రెండు రోజులుగా సంతకం కూడా చేయకపోవడం చూస్తే ఆయన ఇక్కడి విద్యార్థులకు అందిస్తున్న సేవలు ఏపాటిలో ఇట్టే అర్థమవుతుంది.

ఫ్యాక‌్షన్‌.. యాక‌్షన్‌
యూనివర్సిటీలో ఎంపీఈడీ చేసిన ఓ వ్యక్తి తన స్వగ్రామంలో చిన్నపాటి గొడవలకు ఫ్యాక‌్షన్‌ కలరింగ్‌ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రధాన పార్టీకి చెందిన ఓ నేత అతడిని తన వద్ద బంధించాడు. చివరకు ఆయనే ఆశ్రయం కల్పించాడు. కేంద్రీయ విశ్వవిద్యాలయలో కాంట్రాక్టు పీడీగా కుదురుకున్నాడు. అలా క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టి జిల్లాలోని కబడ్డీ జట్లకు కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత జిల్లాలో ఓ ప్రధాన క్రీడను శాసిస్తున్న స్థానికేతర వ్యక్తి పంచన చేరి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అలా.. ఓ ప్రధాన క్రీడా సంస్థలో పాగా వేశాడు. ప్రస్తుతం అక్కడి నుంచే తన కార్యకలాపాలను సాగిస్తున్నాడు. వివిధ క్రీడా పోటీలకు సంబంధించిన విషయాల్లోనూ అక్కడి నుంచే చక్రం తిప్పుతున్నాడు. ఇక రాజకీయంగా నేతల అండ తోడు కావడంతో జిల్లా క్రీడా లోకాన్ని ఈయన శాసిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement