ఆరని జ్యోతిలా.. ఆత్మీయ స్మృతిలా..
ఆరని జ్యోతిలా.. ఆత్మీయ స్మృతిలా..
Published Fri, Sep 2 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి..ఆ పేరు వింటేనే నిరుపేదల హృదయాలు పులకిస్తాయి. పేదల గుండె చప్పుడును ఆలకించిన నాయకుడు కాబట్టే అనితర సాధ్యమైన అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీతో లక్షల ప్రాణాలు నిలబెట్టారు. వైఎస్ అమితంగా ఇష్టపడే జిల్లాల్లో తూర్పు గోదావరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన దివంగతులై ఏడేళ్లయినా ఇప్పటికీ ప్రతి పేదవాని గుండెల్లో గూడుకట్టుకునే ఉన్నారు.
‘తూర్పు’ సెంటిమెంట్‌ను బలంగా విశ్వసించే వైఎస్ అధికారం చేపట్టాక తన మానసపుత్రిక అయిన ‘ఇందిరమ్మ’ పథకానికి 2006 ఏప్రిల్ 1నlకపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే వైఎస్ ప్రారంభించారు. డెల్టా రైతులకు వరప్రదాయినిలాంటి డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. జిల్లాకు రూ.1,697.24 కోట్లు కేటాయించారు. తూర్పు, మధ్య డెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌లో సాగునీటి కాలువల ఆధునికీకరణకు రూ.1,170.21 కోట్లు, మురుగునీటి కాలువలకు రూ.486.45 కోట్లు కేటాయించారు. 2008లో ఆరంభమై హయాంలో శరవేగంగా సాగిన ఆధునికీకరణ పనులను ఆయన మరణానంతరం పాలకులు అటకెక్కించారు.
పొలాలకీ, గళాలకూ నీరు..
ఏటిగట్ల అభివృద్ధికి రూ.540 కోట్ల వ్యయంతో 31 ప్యాకేజీలుగా నిర్ణయించి 2007లో పనులను ప్రారంభించి 2010 లోపు పూర్తి చేయాలని వైఎస్ తలపోశారు. 2009 వరకూ వేగంగా జరిగిన ఏటిగట్టు పనులు ఆయన హఠాన్మరణం తరువాత నిలిచిపోయాయి. జలయజ్ఞంలో భాగంగా మహానేత చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ 11 ఏళ్లు అవుతున్నా 60.4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.10 కోట్లతో పథకం నిర్మించి తమ దాహార్తి తీర్చిన వైఎస్‌ను జన్మజన్మలకు మరిచిపోలేమని రాజోలు ప్రాంతవాసులంటున్నారు. 2009లో రామచంద్రపురం వాసులకు గుక్కెడు నీరందించేందుకు రూ.21 కోట్లతో రక్షిత మంచినీటి పథకానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. కానీ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు మంచినీటి కొరతతో అల్లాడుతున్నారు. రాజానగరం నియోజకవర్గం కలవచర్ల వద్ద రూ.18 కోట్లతో పుష్కరలిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది కూడా మహానేతే. 2003 మేలో వైఎస్ జరిపిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలోనే ‘ఉచిత విద్యుత్తు’ పథకానికి బీజం పడింది. తీవ్ర అస్వస్థతతో యాత్రకు విరామమిస్తూ బూరుగుçపూడిలో ఆగిపోయిన వైఎస్ వద్ద మెట్టరైతులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో చలించిన ఆయన సీఎం కాగానే ఉచిత విద్యుత్తు ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు.
మెట్టకు వరం పుష్కర పథకం
మెట్టలో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు అంది సస్యశామలమైంది. జలయజ్ఞంలో భాగంగా మెట్టప్రాంతానికి రూ.600 కోట్లు కేటాయిచారు. 2008లో సోనియా చేతుల మీదుగా పుష్కర పథకాన్ని వైఎస్ ప్రారంభింపచేసి మెట్ట రైతులకు అపర భగీరథుడయ్యారు. రాజమండ్రిరూరల్‌లో రూ.100 కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్(నేక్)ను తీసుకువచ్చింది ఆ మహానేతే. రూ.800 కోట్లతో గోదావరిపై నాలుగో వంతెనకు అంకురార్పణ చేసిందీ ఆయనే. ఏజెన్సీలో గిరిజనుల భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో వైఎస్ ముసురుమిల్లి, భూపతిపాలెం ప్రాజెక్టులను మంజూరు చేశారు. కాకినాడలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు సుమారు రూ.50 కోట్లతో వైఎస్ హయాంలో పేర్రాజుపేట రైల్వే క్రాసింగ్‌పై వైఎస్‌ఆర్ వారధి పేరుతో ఒక ఫ్లై ఓవర్‌ను, సాంబమూర్తినగర్ రైల్వే క్రాసింగ్‌పై మల్లిపూడి శ్రీరామసంజీవరావు వారధి పేరుతో మరో ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఆయన హయాంలోనే కొండయ్యపాలెం, పోర్టు ప్రాంతంలో మరో రెండు ఫ్లై ఓవర్ల కోసం శంకుస్థాపన చేసినప్పటికీ ఆకస్మిక మరణంతో పురోగతి లేకపోయింది. కాకినాడ డెయిరీ ఫారం సెంటర్‌లో సుమారు రెండువేల రాజీవ్‌గృహకల్ప సముదాయాలను పూర్తి చేసి ఎంతో మంది పేదల సొంతింటి కల నెరవేర్చారు. జీవితంలో వెలుగులు నింపిన ఆ మహనీయుని ప్రాణజ్యోతి మలిగిపోయినా.. ఆయన స్మతి ఆరనిజ్యోతిగా సదా ప్రజ్వలిస్తూనే ఉంటుంది.
Advertisement