ఆవేదనతో యువరైతు ఆత్మహత్య
గొల్లపల్లె (తర్లుపాడు): పంటలు ఎండిపోతున్నాయన్న ఆవేదనతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని గొల్లపల్లెలో సోమవారం వెలుగులోకి వచ్చింది. తాడివారిపల్లె ఎస్సై లకా్ష్మరెడ్డి కథన ప్రకారం.. గ్రామానికి చెందిన పొడతరపు కాశయ్య, కనకమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయవాడలో ముఠా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కుమారుడు ఏడుకొండలు తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది తన నాలుగు ఎకరాల్లో వరి, మిరప పంటలను బోరు బావి కింద సాగు చేశాడు.
గతంలో ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న బోరుబావి ఒట్టిపోవటంతో సొంతంగా బోరు ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న బోరుబావి కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన బోరుబావికి ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవటంతో పక్కన ఉన్న రైతుల ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా చేసుకుంటున్నాడు. ఏడుకొండలు దాయాదులైన వెంకటేశ్వర్లు, వెంకట కాశయ్యలు తాము అదే ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా చేసుకుంటామని, లేదంటే ఏడుకొండలు వైర్లు కూడా తొలగించాలని సంబంధిత రైతులతో చెప్పారు. ఆ రైతులు ఏడుకొండలు విద్యుత్ వైర్లను తొలగించారు. ఈ నేపథ్యంలో బోరు పనిచేయకపోవటంతో పంటలు ఎండిపోయాయి.
తీవ్ర ఆవేదన చెందిన ఏడుకొండలు కూల్‌డ్రింక్‌లో పొలానికి తెచ్చుకున్న గుళికల మందు కలుపుకుని తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో మార్కాపురం ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఏడుకొండలు మృతి చెందాడు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన పొలం పనులు పర్యవేక్షిస్తుండేవాడని బంధువులు తెలిపారు. ఎస్సై లకా్ష్మరెడ్డి కేసు నమోదు చే సి దరాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.