
ప్రేమికుడి విషాదం
ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరగుతుండటంతో తట్టుకోలేక ప్రియుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సిరిసిల్ల: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరగుతుండటంతో తట్టుకోలేక ప్రియుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో బుధవారం తెల్లవారుజామున వెలుగుచూసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన అరవింద్(20) ఇంటి పక్కనే నివాసముండే చందన(18) అనే యువతిని ప్రేమించాడు. ఆ యువతి తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగికరించకుండా వేరే వ్యక్తితో పెళ్లి నిశ్ఛయించారు. దీంతో గత కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోయిన అరవింద్.. చందనను పెళ్లి చేసుకోబోతున్న యువకుడి వాట్సప్‌కు తమ ఇద్దరు ఫొటోలు పంపాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ కూడా జరిగి.. పోలీసుల సమక్షంలో మరో మారు ఇలా చేయనని అరవింద్ ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.