
విద్యుత్ తీగ తగిలి యువకుడి మృతి
* నష్టపరిహారం ఇవ్వాలని బంధువుల రాస్తారోకో
* అధికారుల హామీతో రాస్తారోకో విరమణ
ఈలకొలను (రంగంపేట): విద్యుత్‌తీగ తగిలి ఈలకొలనులో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు. స్థానిక పెరుమాళ్ల దుకాణం ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభం వద్ద మూత్ర విసర్జనకు శుక్రవారం ఉదయం వెళ్లిన గ్రామానికి చెందిన తానింకి అశోక్‌కుమార్(19) కాలికి విద్యుత్ స్తంభం ఎర్త్‌వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు.
అతన్ని రక్షిద్దామని ప్రయత్నించిన వరుసకు సోదరుడైన తానింకి మణిరాజు కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ విషయం గమనించిన స్థానికులు కర్రతో తీగలను తొలగించి అతన్ని రక్షించగలిగారు. స్వల్ప అస్వస్థతకు గురైన మణిరాజును రాయవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ తీగలు, విద్యుత్ డబ్బా ట్రాన్స్‌ఫార్మర్ స్తంభానికి కింది భాగాన ఉండడంతో అశోక్ మరణించాడంటూ అతని కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గంపేట విద్యుత్‌శాఖ ఏడీఏ మీనకేతనరావు, రంగంపేట విద్యుత్ శాఖ ఏఈ భరతరావు అక్కడకు చేరుకున్నారు.
అశోక్‌కుమార్ కుటుంబసభ్యులతోను, రంగంపేట ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నీలపాల త్రిమూర్తులు, గ్రామ సర్పంచ్ కడిమి సాయిబాబులతో వారు చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి విద్యుత్ శాఖపరంగా నష్టపరిహారం చెల్లించడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇవ్వడంతో ఆకుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. అశోక్ తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట ఏఎస్సై వి.సూర్యప్రసాద్ కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి, పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం అశోక్ మృత దేహాన్ని పంపారు.
వైఎస్సార్ సీపీ రైతువిభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లంక చంద్రన్న, జెడ్పీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, మాలమహానాడు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తిరగటి శివ, జిల్లా మాలమహానాడు సహాయ కార్యదర్శి పోతుల చెల్లయ్య తదితరులు అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అశోక్ అకాల మృతితో అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తానింకి కృష్ణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడైన అశోక్ ఇంటర్ చదివాడు. డిగ్రీ చదివే ప్రయత్నాల్లో వున్నాడు. అశోక్ మరణంతో అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పించాలని కుటుంబ సభ్యులు సత్యనారాయణ, చిట్టిబాబు కోరారు.