కరీంనగర్ కలెక్టరేట్‌లో కలకలం
కరీంనగర్ అగ్రికల్చర్: కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి బయలుదేరుతున్న సమయంలో కలెక్టరేట్‌లో ఒక్కసారిగా దూకి క్రిమిసంహారక మందుతాగాడు. పోలీసులు అప్రమత్తమై యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లాలోని మహదేవపూర్ మండలం ఎడవెల్లికి చెందిన లచ్చుమల్లు, చిన్నవ్వల కుమారుడు పర్వతం గోపి(25) డిగ్రీ చదివి ఖాళీగానే ఉంటున్నాడు. ఇతనికి ముగ్గురు అక్కలు, ఒక చెల్లెలు, అన్న ఉన్నారు. ఇద్దరు అక్కలకు వివాహం కాగా.. ఒకరు పుట్టింట్లోనే ఉంటున్నారు. చెల్లి చదువుకుంటోంది.
తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉం ది. తండ్రి లచ్చుమల్లు(65)కు గతంలో రూ.200 వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఆధార్‌కార్డులో లచ్చుమల్లు వయస్సు 65కు బదు లు 25గా ముద్రితమైంది. దీంతో ప్రస్తుతం పింఛన్ రావడం లేదు. ఆధార్‌లో తండ్రి వయస్సు సవరించి, పింఛన్ ఇప్పించాలని మండల కార్యాలయాల్లో, కలెక్టరేట్‌లో జరి గే ప్రజావాణిలో పలుమార్లు అర్జీలు సమర్పించినా ఫలితం లేకపోరుుంది. మరోవైపు ఉద్యోగం లేక, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గోపి మనస్తాపం చెందాడు. సోమవారం సీఎం కేసీఆర్ వస్తున్న విషయం తెలుసుకుని.. ఇంటివద్ద నుంచే క్రిమిసంహార మం దు, బ్లేడు వెంట తీసుకొని వచ్చాడు.
ముందుగా ఎల్‌ఎండీ గెస్ట్‌హౌస్ వద్దే సీఎంను కలుసుకోవాలనుకున్నాడు. పరిస్థితి అనుకూలించకపోవడంతో కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. పోలీసు బందోబస్తు ఉండగానే కలెక్టరేట్‌లోనికి ప్రవేశించి పోర్టికో సమీపంలో ని వికలాంగుల శాఖ కార్యాలయం ఎదుట నిరీక్షించాడు. సీఎం అధికారులతో సమీక్షను ముగించుకుని భోజనానికి బయలుదేరే క్రమంలో కిందికి రాగానే.. గోపి కాన్వాయిలోకి ప్రవేశించి క్రిమిసంహారక మందు తాగాడు. విషయం తెలిసిన సీఎం కేసీఆర్ వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అధికారులు గోపిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.