
ఏపీ మంత్రి పేరుతో అరకోటి వసూళ్లు
మంత్రి తనకు సమీప బంధువని చెప్పుకొంటూ.. ప్రత్తిపాటి సతీష్ అనే యువకుడు విజయవాడలో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగ యువత నుంచి దాదాపు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, అవి ఇప్పిస్తానని చెబుతూ సతీష్ పలువురు యువకుల నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు.
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర టీడీపీ నేతలతో తాను ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, వాటిని చూపించి మంత్రి తనకు సమీప బంధువు అని అందరినీ నమ్మించాడు. మంత్రి ఇంటిపేరు, సతీష్ ఇంటిపేరు ఒకటే కావడంతో యువకులు కూడా నమ్మారు. తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో.. 50 లక్షలను అతడికి ముట్టజెప్పారు. చివరకు ఉద్యోగాలు రాక, ఉన్న డబ్బులు పోయి యువకులు లబోదిబోమంటున్నారు.