ప్రత్యేక హోదా కావాల్సిందే..
– నినదించిన యువత, విద్యార్థి లోకం
– జగన్ ప్రతీ మాటకూ మద్దతు
– కిక్కిరిసిన వేదిక
– మద్దతు పలికిన మేధావులు
ప్రత్యేక నినాదం హోరెత్తింది. ఉద్యమ శంఖారావం నలు దిశలా ప్రతిధ్వనించింది. యువతరం కదంతొక్కింది. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడని ఉవ్వెత్తున ఎగిసింది. పోరుబాటలో మేము సైతం అడుగులో అడుగు వేస్తామని.. కెరటాలై గర్జిస్తామని యువతీ యువకులు ప్రతిన బూనారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కో మాట.. ఉద్యమ తూటా కాగా, హోదా సాధనే లక్ష్యంగా ప్రభుత్వంపై పోరుబావుటా ఎగురవేశారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మేధావులు, యువత, విద్యార్థిలోకం డిమాండ్ చేసింది. కందనవోలుకు పూర్వవైభవం రావాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ముక్తకంఠంతో నినదించారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు తరలివస్తాయని.. తద్వారా తమకు ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో మేధావులతో పాటు యువత, విద్యార్థిలోకం కదం తొక్కింది. ప్రత్యేక హోదా సాధనలో వెనక్కి తగ్గేదిలేదని నినదించారు. కార్యక్రమాల్లో పాల్గొంటే పీడీ కేసులు పెడతామన్న ప్రభుత్వ పెద్దల మాటలను ఏమాత్రం లెక్కచేయక కదంతొక్కారు. హైదరాబాద్ నుంచి ఉదయమే కర్నూలుకు బయలుదేరిన వైఎస్ జగన్... పంచలింగాల చెక్‌పోస్టుకు 10 గంటల 20 నిమిషాలకు చేరుకున్నారు. ముందుగానే అక్కడికి చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు భారీఎత్తున స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించారు. అనంతరం సుమారు 50 నిమిషాల పాటు సాగిన జగన్ ప్రసంగానికి సభికుల నుంచి కేరింతలతో మద్దతు లభించింది.
కాబోయే సీఎం జగనన్నే..
వైఎస్ జగన్ తన మొత్తం ప్రసంగంలో ప్రత్యేక హోదా ఆవశ్యకతను స్పష్టం చేశారు. హోదా వస్తే కలిగే లాభాలను వివరించే ప్రయత్నం చేశారు. హోదాతో ప్రతి జిల్లా హైదరాబాద్‌గా మారి.. ఉపాధి అవకాశాలు వస్తాయని, గతంలో జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత నేతల తీరు మారిన వైనాన్ని నిశితంగా ఎండగట్టారు. పార్లమెంట్‌నే సాక్షిగా చేసి ఇచ్చిన హామీలకే విలువ లేదని.. అందుకే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటన చేసిన సందర్భంగా అందరూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక హోదా కావాల్సిందేనని నినదించారు. కాబోయే ముఖ్యమంత్రి జగనన్నేనని ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా సాధనలో చివరి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడతామని యువత, విద్యార్థులు ప్రకటించారు. జగన్ ప్రతీ అడుగులో కలిసి నడుస్తామని భరోసానిచ్చారు.
పీడీ యాక్ట్‌పై పిడికిలి
ప్రత్యేక హోదా సాధనలో పాల్గొనే విద్యార్థులపై పీడీ యాక్ట్‌లు పెట్టాలన్న ప్రభుత్వ పెద్దల మాటలపై విద్యార్థులు మండిపడ్డారు. కేసులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనలో ప్రాణాలైనా అర్పిస్తామని స్పష్టం చేశారు. సభలకు వెళ్లవద్దన్న సీఎం మాటలను ఏ మాత్రం లెక్కచేయక సభకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు. జగన్ సభలకు పిల్లలను పంపవద్దని.. వారు చెడిపోతున్నారని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలేమో నడిరోడ్డుమీద తహసీల్దార్‌ను కొట్టవచ్చునా అని ఎంబీఏ పూర్తి చేసిన సుధ మండిపడ్డారు. ఆయన కొడుకేమో విదేశాల్లో మద్యం తాగుతూ అమ్మాయిలతో అసభ్యంగా తిరగొచ్చా? ఆయన మంత్రుల పిల్లలేమో నడిరోడ్డు మీద అమ్మాయిలను ఎడిపించి.. కుక్క అడ్డు వచ్చిందంటారని ఎద్దేవా చేశారు. మా ఓట్లు వేయించుకుని గెలిచిన ఆ నాయకులకు కనీసం కుక్కకు ఉన్న విశ్వాసం కూడా లేదంటూ విద్యార్థిని సుధ మాటలకు సభలోని విద్యార్థులు కేరింతలు కొట్టారు. మొత్తం మీద యువభేరి ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాంతో పాటు పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కాటసాని రామిరెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డి, హఫీజ్‌ఖాన్, రాజగోపాల్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, రామలింగారెడ్డి, బుడ్డా శేషారెడ్ది, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, మురళీ, పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం.. యువజన, విద్యార్థి విభాగాల రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, సలాంబాబు, జిల్లా అధ్యక్షులు రాజా విష్ణువర్దన్ రెడ్డి, అనిల్‌కుమార్, పార్టీ నేతలు వెంకట కృష్ణా రెడ్డి, సురేందర్ రెడ్డి, నరసింహులు యాదవ్, రాకేష్ రెడ్డి, నాగరాజు యాదవ్, కర్నాటి పుల్లారెడ్డి, ప్రదీప్ రెడ్డి, శ్రీరంగడు, విజయలక్ష్మి, సలోమి, పోచా శీలారెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, భరత్‌కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, కాంతారెడ్డి, సత్యంరెడ్డి, డీకే రాజశేఖర్, రఘు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.