- ఐఎఫ్‌ఎస్ డెప్యూటీ సెక్రెటరీ సందీప్‌కుమార్‌రెడ్డి
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం
Published Mon, Aug 15 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
బసంత్‌నగర్: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని భారత విదేశీ వ్యవహారాల శాఖ (ఐఎఫ్‌ఎస్) డెప్యూటీ సెక్రటరీ బయ్యపు సందీప్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన స్వగ్రామమైన కమాన్‌పూర్ మండలం రాణాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, బసంత్‌నగర్‌లోని ఆలీవర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేశోరాం గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. విద్య అనేది మనిషిలో విశ్వాసాన్ని పెంచుతుందని, ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని, అందుకు వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. వ్యక్తిగత నైపుణ్యం కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చైనాలో ప్రతి ఒక్కరికి వారివారి అభీష్టం మేరకు ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, అలాంటి విధానాన్ని మన దేశంలో సైతం అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తన స్వగ్రామమైన రాణాపూర్ గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. తమ ఇంటిని గ్రామ అంగన్‌బాడీ కేంద్ర నిర్వహణకు ఇచ్చినట్లు వివరించారు. ఆయన వెంట బయ్యపు మనోహర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కొండ్ర శంకర్, బాలసాని కుమార్, తిరుపతి ఉన్నారు.
Advertisement