ప్రాజెక్టులో కోట్లు మెక్కుతూ పరిహారానికి తూట్లా! | Ys jagan comments on polavaram | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులో కోట్లు మెక్కుతూ పరిహారానికి తూట్లా!

Published Thu, Jul 14 2016 1:50 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

ప్రాజెక్టులో కోట్లు మెక్కుతూ పరిహారానికి తూట్లా! - Sakshi

ప్రాజెక్టులో కోట్లు మెక్కుతూ పరిహారానికి తూట్లా!

పోలవరంపై వైఎస్ జగన్ ఎద్దేవా
- నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వం
పరిహారం పెంచాల్సిందే.. అది ప్రాజెక్టు వ్యయంలో 5శాతం లోపేగా..
నిర్వాసితులవన్నీ న్యాయమైన కోర్కెలే...
కేంద్రం లేఖలు రాస్తున్నా కాంట్రాక్టరును మార్చని చంద్రబాబు
ఇంతమంది ఉసురు పోసుకుని మీరు సాధించేదేమిటి బాబూ?
కుక్కునూరు సభలో నిప్పులు చెరిగిన ప్రతిపక్షనేత
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, కుకునూరు : ‘‘పోలవరం ప్రాజెక్టు వ్యయం రెట్టింపునకు పెంచేశారు... కేంద్రం తిడుతూ లేఖలు రాస్తున్నా కోట్లరూపాయల కమీషన్లు, ముడుపుల కోసం మీ బినామీ కాంట్రాక్టరును మార్చడంలేదు. నిర్వాసితుల పరిహారం పెంచే విషయంలో మాత్రం మీకు మనసురావడం లేదు. పక్కపక్కనే ఉన్న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పరిహారం విషయంలో వేర్వేరు ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారు?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘నిర్వాసితులు అడుగుతున్నవన్నీ న్యాయమైన డిమాండ్లే. వారికి న్యాయం చేస్తున్నామా అని గుండెల మీద చేయేసుకుని ఆలోచించాలి. కానీ మీరు ఆదిశగా ఆలోచించడం లేదు. ఇంతమంది ఉసురుపోసుకుని సాధించేదేమిటి?’ అని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో జరిగిన పోలవరం ముంపు బాధితుల సభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ముందుగా వారి గోడు విన్నారు. అనంతరం జరిగిన సభలో బాధితులు, ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే...

 మనం అడుగుతున్నవి న్యాయబద్దమైన కోర్కెలే
 ‘‘మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే పాలకపక్షం వినే పరిస్థితుల్లో లేదు. మాగోడు వినండి, మా పరిస్థితులు చూడండి, మేం అడుగుతున్న న్యాయబద్దమైన కోర్కెలను తీర్చడానికి మనసు రాకపోవడం దారుణమని గళం విప్పుతూ సాగుదాం. పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వస్వం కోల్పోతున్న వారిని ఆదుకోవాలని అడిగితే వెంటనే చంద్రబాబు ఏమంటాడో తెలుసా? పోలవరం ప్రాజెక్టు రావడం జగన్‌కు ఇష్టంలేదంటాడు. అన్యాయం అని ప్రశ్నించినప్పుడల్లా జగన్‌కు ఇష్టంలేదని ఆరోపించడం మామూలైపోయింది. రాజధాని రైతుల వద్ద నుంచి అన్యాయంగా భూములు లాక్కున్నారు.

ఆ భూములకు పప్పుబెల్లాల మాదిరి తక్కువ రేట్లు ఇచ్చి విదేశీ కంపెనీలతో వ్యాపారాలు చేస్తున్నారు. దీని గురించి అడిగితే చంద్రబాబు ఏమంటాడో తెలుసా? జగన్‌కు అమరావతిలో క్యాపిటల్ సిటీ రావడం ఇష్టం లేదంటాడు. ఏదైనా అన్యాయాన్ని సరిచేయండి అని అడిగితే వెంటనే మన మీద బండలు వేస్తాడు. ఇక్కడ పోలవరం ముంపు బాధితులు ఎందుకింత అవస్థ పడుతున్నారనేది చూడాలి. పోలవరం ప్రాజెక్టు నా ఒక్కరి ఆకాంక్ష మాత్రమే కాదు. రాష్ర్ట ప్రజల అందరి ఆకాంక్ష. ఎందుకంటే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు మొత్తం రాష్ట్రానికే మేలు జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు కోసం దాదాపు 110 కిలోమీటర్లు నేను కూడా పాదయాత్ర చేశాను. ఇక్కడి వారు ఎవ్వరూ పోలవరానికి వ్యతిరేకులు కాదు. దానికోసం నాలుగడుగులు ముందుకు వేసే వాళ్లే ఇక్కడ ఉన్నారు. పోలవరం కోసం అన్నీ త్యాగం చేస్తున్న వీళ్లకు మనం న్యాయం చేస్తున్నామా అని పాలకులు గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించాలి. వీళ్లు అడుగుతున్న ఏ ఒక్క కోరికా అన్యాయమని అనిపించడం లేదు.

 పట్టిసీమ ప్యాకేజీ ఇవ్వాలి
 అన్నా పక్కన పట్టిసీమలో పరిహారంగా ఎకరానికి రూ. 20 లక్షలు ఇస్తున్నారు. మా పరిస్థితి ఏమిటన్నా అని అడుగుతున్నారు. పట్టిసీమకు ఇచ్చిన ప్యాకేజీ మాకు కూడా వర్తింపజేయండి అని ఇక్కడి వారు అడగటంలో తప్పేముందీ అని నేను అడుగుతున్నా. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ఒకదానికొకటి ఆనుకొనే ఉన్నాయి. ఒకే జిల్లాలో పక్కపక్కనే ఉన్న ప్రాజెక్టులకు వేర్వేరు రేట్లు ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు అని నేను అడుగుతున్నా. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం చుట్టుపక్కల ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ రేట్లు ఎంతైతే ఉంటాయో అవే రేట్లు ఇక్కడ కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 1/70 భూములు ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ విలువ తక్కువ చూపిస్తున్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేటలో ఎకరాకు రూ.7 లక్షల మార్కెట్ రేటు ఉంది. పట్టిసీమలో రూ.20 లక్షలు మీరే ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం భూముల విలువ ఎందుకు తగ్గిస్తున్నారు? చింతలపూడి నుంచి పట్టిసీమ, పోలవరం అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. పట్టిసీమకు అమలు చేసిన ప్యాకేజీ అందరికీ వర్తింపజేయాలి.

 త్యాగాలు చేసిన వాళ్ళం.. మా పరిస్థితి ఏమిటన్నా...
 పదేళ్ల కిందట ఎకరాకు లక్షా 15 వేలు ఇచ్చి భూములు తీసుకున్నారన్నా... అది అప్పటి రేటన్నా... ఇప్పుడు ఆ రేటు రూ. 20లక్షలుగా మారింది. మేము వేరే చోట భూములు కొనాలంటే రూ. 20లక్షలకు తక్కువకు భూములు రావన్నా... ప్రాజెక్టుల కోసం ఎంతో త్యాగం చేసిన వాళ్లం మా పరిస్థితి ఏమిటన్నా అని అడుగుతున్నారు. నిజమే. మొదట భూములు ఇచ్చింది వాళ్లే. 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 20 నుంచి సెక్షన్ 30 నిబంధనల ప్రకారం... ఐదేళ్ల వరకు ఎలాంటి వినియోగం జరపకపోతే ఆ భూములు రైతులకు తిరిగి వెనక్కి ఇవ్వాలి. కానీ వాళ్లు ఇంకా మానవత్వం చూపిస్తున్నారు. పట్టిసీమ లాగా ఎకరానికి రూ.20 లక్షలు ఇవ్వాలని కూడా అడగడం లేదు. ఆ రోజు భూములు ఇచ్చిన వాళ్లకు లక్షా 15 వేలు ఇచ్చారు. ఇప్పుడు మరో ఐదు లక్షలు ఇప్పించండని వాళ్లు అడుగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనావ్యయం మొన్నటి దాకా రూ. 16 వేల కోట్లు అన్నారు. ఇవ్వాళ రేట్లు పెరిగాయి రూ. 32వేల కోట్లు అంటున్నారు. అలాంటపుడు భూములు ఇచ్చిన వాళ్లకు కాస్తో కూస్తో ఇస్తే ప్రాజెక్టు మొత్తం విలువలో అది 5 శాతం కూడా ఉండదు కదా. భూములు ఇచ్చిన వాళ్ల ముఖంలో చిరునవ్వు ఉండాలి. వాళ్ల త్యాగాలు మరచిపోకూడదు.

 ఈ సర్కారు ఎల్లకాలం సాగదు.
 మీరు అడిగినవన్నీ సమంజసమైనవి. ఈ డిమాండ్‌ల కోసం బాధితులకు తోడుగా, అండగా నిలబడతాం. ఎవరికైనా ఏదైనా అందకపోతే నిరాశపడాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టుకు మీరు సపోర్ట్ చేయండి, ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం సాగదు. మరో రెండేళ్లకు మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఏవైతే మీకు చెప్పానో అవన్నీ పూలల్లో పెట్టి మీకిస్తాను. పోలవరం ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయిద్దాం. మీ ముఖాల్లో చిరునవ్వు వచ్చేటట్లు నేను చేసి పెడతాను. చంద్రబాబుపై పోరాటం తప్పకుండా కొనసాగిస్తాం.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 ఇంత మోసగాడు దేశంలోనే ఉండడంటారు..
 రెండేళ్లలో ప్రైవేట్ విమానాల్లో తప్ప వేరే విమానాలు ఎక్కలేదు. 20 మంది ఎమ్మెల్యేలను రూ.30 కోట్లు చొప్పున కొన్నావు. అంటే రూ.600 కోట్లు ఖర్చుపెట్టావు. బాబు పాలనలో ఏదడిగినా టెంపరరీనే.  చివరకు టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ ఇళ్లంటాడు. వంద కోట్లు మరమ్మతులకు వృధా చేశాడు. కన్సల్టెన్సీ పేరుతో వాళ్లకింత, నాకింత అంటూ భాగం పంచుకొని దాదాపుగా ఈ రెండేళ్లలో రూ. 300 కోట్లు వాళ్లకు ఇచ్చాడు. ఈ డబ్బులు ఇటువైపు మళ్లించి ఉంటే పోలవరం ప్రాజెక్టుకు రైతులు ఆనందంగా భూములు ఇచ్చి ఉండే వారు. చివరకు పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు అడ్డగోలుగా నాశనం చేస్తున్నాడు. దీని గురించి కేంద్రం లేఖలు రాస్తోంది. కాంట్రాక్టరు పనులు సరిగా చేయడం లేదని, మార్చాలని చెప్పింది. చంద్రబాబు మాత్రం ఆ కాంట్రాక్టరు తన బినామీ కాబట్టి మార్చే ప్రసక్తి లేదంటున్నారు. కేంద్రాన్ని మోసం చేస్తూ పోలవరం ప్రాజెక్టులో లంచాల కోసం సబ్ కాంట్రాక్టరును కూడా తెచ్చుకుంటున్నారు. వాళ్ల ద్వారా కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. చివరకు కేంద్రం కూడా ఈ దోపిడీని చూసి పోలవరం ప్రాజెక్టుకు సపోర్ట్ చేసే విషయంలో నాలుగడుగులు వెనక్కి వేసింది. దేశంలోనే ఇంత దారుణమైన సీఎం ఎవరూ ఉండి ఉండరు. ఈ రెండేళ్లలో బాబు చేసింది సున్నా. చంద్రబాబు దిగిపోయిన తరువాత ఆయన గురించి ఎవరైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇంత మోసగాడు బహుశా దేశంలో ఎవ్వడూ ఉండడని అంటారు.
 
 అసైన్డ్ భూములకూ పరిహారం ఇవ్వాలి
 పోడు భూములు, అసైన్డ్ భూములు, డీకేటీ భూములు.. పేరేదైనా  ఆ భూములు కూడా మావే కదన్నా... అటువంటప్పుడు ప్రైవేట్ భూములకు ఇచ్చే రేటు, అదే పరిహారం మాకు కూడా ఇవ్వాలి కదన్నా అని అడుగుతున్నారు. అది తప్పు కూడా కాదు. నిరుపేదలకు ఎక్కువ సాయం చేయాలే కాని వాళ్లను తప్పించే కార్యక్రమం చేయడం ఎంతవరకు ధర్మం? ఆర్‌ఆర్ ప్యాకేజీ రెండు, మూడు లక్షలు ఇస్తే తామెలా బతకాలని వారు అడుగుతున్నారు. కనీసం పది లక్షలు ఇవ్వాలని వారు అడుగుతున్నారు. అది కూడా న్యాయమైన కోరికే.
 
 స్థానికత తేలేదెన్నటికి?
 ముంపు మండలాలు ఏపీలో చేరి రెండేళ్లయింది. స్థానికత సమస్య తీరలేదు.  ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలి. స్థానికత లేని కారణంగా పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. విద్యార్థులు ఏ పరీక్షలు రాయాలన్నా వీళ్లు ఏ రాష్ట్రంలో ఉన్నారన్నది తెలియడం లేదు. డీఎస్సీ రాస్తే మీ రాష్ట్రం కాదిది మీకు ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలూ రావని తెలంగాణవాళ్లు అంటారు. ఇక్కడ పరీక్షలు రాస్తే స్థాని కత లేదు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేమనే స్థితి ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఇంతమంది ఉసురు సోసుకొని నీరు సాధించేది ఏమిటని చంద్రబాబును అడుగుతున్నా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement