
భూ సమీకరణ తీరుపై వైఎస్ జగన్ ధర్నా
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ సీపీ నేతలతో పాటు రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ కింద ఇప్పటికే భూములు కోల్పోయిన, భూ సేకరణ పేరుతో భూములు కోల్పోనున్న రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రైతుల గొంతుపై కత్తిపెట్టి భూ సేకరణకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు చర్యలను ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఖండించనున్నారు.
కాగా తమ భూములు బలవంతంగా లాక్కోవద్దని, ఇచ్చిన వారి నుంచి మాత్రమే తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏడాదికి మూడు పంటలు, అనుకూలిస్తే నాలుగు పంటలు పండే భూములను రాజధాని పేరుతో చంద్రబాబుకు ఇచ్చి తాము ఎటుపోయి, ఏమి తిని బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడటమే కాకుండా పరోక్షంగా పోలీసులతో బెదిరింపులకు దిగుతున్న విషయం తెలిసిందే.