
మూడో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరాహార దీక్ష
కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షకు విశేష స్పందన వస్తోంది.
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందన వస్తోంది. కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఏపీకి జరుగుతున్న జల అన్యాయాన్ని తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ చేస్తున్న నిరాహారదీక్షకు రెండో రోజు జిల్లాల నుంచి జనం పోటెత్తారు. కర్నూ లు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, జనం భారీగా తరలివచ్చి ప్రియతమ నేత వైఎస్ జగన్ కు మద్ధతు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సాగిస్తున్న నిరాహారదీక్షకు వెల్లువలా మద్దతు లభిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల దీక్షలు, ధర్నాలతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మండలకేంద్రాలు దద్దరిల్లాయి. అనేక మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలకు మద్దతు పలకడం విశేషం. ఉదయం ఎనిమిది గంటల నుంచే వైఎస్ జగన్ దీక్షా వేదిక వద్ద తన కోసం వచ్చిన జనాన్ని కలుసుకుంటున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయకుండా దూర ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చి దీక్ష వద్ద కూర్చుని మద్ధతుగా నిలుస్తున్నారు. మంగళవారం పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తరలివచ్చి వైఎస్ జగన్ చేస్తున్న జలదీక్షకు మద్దతు ప్రకటించారు.