
పోరాడకపోతే ఎప్పటికీ వెనుకబాటే
కర్నూలు: నదులపై ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కడుతూ నీళ్లు వాడుకుంటున్నారని, మనకు ఎక్కడ నుంచి నీళ్లు వస్తాయని, దీనిపై పోరాడకపోతే ఎప్పటికీ వెనుకబడిఉంటామని వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష వేదికపై ఆమె మాట్లాడారు.
రాయలకాలంలో రత్నాలసీమగా పేరుగాంచిన రాయలసీమ నేడు వెనుకబడిపోవడానికి నీళ్లు లేకపోవడమే కారణమని బుట్టా రేణుక అన్నారు. నీళ్లులేకపోతే ఎలా అభివృద్ధి చెందుతామని వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఏవిధంగా న్యాయం చేస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదని చెప్పారు. చంద్రబాబు చేయాల్సిన పనిని వైఎస్ జగన్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం కలసివుంటే ఇలాంటి సమస్యలు రావనే ముందుచూపుతో సమైక్యఉద్యమం చేశామని చెప్పారు.