మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం | YS Jagan Mohan Reddy raithu barosa yatra in anantapur district | Sakshi
Sakshi News home page

మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం

Published Wed, Jun 1 2016 3:01 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం - Sakshi

మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, రుణమాఫీ చేస్తామని తమను మోసం చేశారని అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం రైతులు, డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయమని స్పష్టం చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను పరామర్శించేందుకు రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పెదవడుగూరులో రైతులు, డ్వాక్రా మహిళలతో  వైఎస్ జగన్ ముఖాముఖి మాట్లాడారు.

కేంద్రానికి సంబంధించి 4500 కోట్ల రూపాయల నిధులతో రైతులకు ఉపాధి కల్పిస్తే రైతులు బాగుపడతారని వైఎస్ జగన్ అన్నారు. ఉపాధి పనులు దొరికితే రైతులు స్థానికంగా ఉంటారనుకుంటే, చంద్రబాబు ఆ డబ్బును తన ఇష్టం వచ్చినట్లు వేరే చోటకు మళ్లించారని ఆరోపించారు. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమాట్లాడారంటే..

  • చంద్రబాబు సీఎం అయ్యేసరికి బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు
  • ఇప్పుడు ఆయన మాఫీ చేయకపోవడంతో 2 రూపాయల వడ్డీ కడుతున్నారు
  • పంట బీమా రావడం లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ అంతంతమాత్రమే
  • చివరకు నీళ్లొస్తాయని చూస్తుంటే బాబు పుణ్యాన నీళ్లు రాకపోగా పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎడాపెడా ప్రాజెక్టులు కట్టేసి, పంపులు పెట్టి నీళ్లు తన్నుకుపోతుంటే కనీసం అడిగే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి చూస్తున్నాం
  • రైతుల బాధలు అర్థం కావాలి. ఆయన అక్కడెక్కడో బంగారు మేడలో కూర్చుని అంతా బాగున్నారు, రైతు రుణాలన్నీ మాఫీ చేశాను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఆనందంతో ఉన్నారని అబద్ధాలు చెబుతున్నారు
  • ఇక్కడి రైతులు చెప్పిన మాటలైనా ఆయనకు అర్థమైతే కాస్తో కూస్తో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం
  • రుణాలు రెన్యువల్ అయి ఉంటే కాస్తో కూస్తో క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేది
  • మాఫీ కాక, రెన్యువల్ కాక, బీమా రాక అన్యాయం అయిపోతున్నారు
  • కనీసం ఇప్పటికైనా రైతులు ఎలా బాధపడుతున్నారో చంద్రబాబుకు అర్థం కావాలి
  • రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, చేనేత కార్మికుల అవస్థలు తెలియాలి
  • కనీసం ఈ మీటింగ్ ద్వారానైనా చంద్రబాబు గారు రైతుల పరిస్థితి అర్థం చేసుకుని వాళ్లకు తోడుగా నిలబడేందుకు ఆయనకు జ్ఞానోదయం కావాలి
  • ఈ విషయమై ఆయనపై గట్టిగా ఒత్తిడి తెస్తాం


అనంతరం వైఎస్ జగన్ ఎదుట రైతులు, డ్వాక్రా మహిళలు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలు ఏం చెప్పారంటే వారి మాటల్లోనే..


కృష్ణారెడ్డి, చిన్నవడుగూరు

నాకు 11 ఎకరాల భూమి ఉంది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టి రుణమాఫీ చస్తామన్నారు. రూపాయి కట్టక్కర్లేదని చెప్పారు. కానీ ఇంతవరకు 1.5 లక్ష గోల్డ్ లోన్, 75 వేల రూపాయలు క్రాప్ లోన్ ఉంది. కేవలం 8వేల రూపాయలే మాఫీ అయింది. రెండింటికీ కలిపి 56800 రూపాయల వడ్డీ అయింది. రెండేళ్ల పాటు మేం క్రాప్ లోన్, గోల్డ్ లోన్ రెన్యువల్ చేయలేదు.. చివరకు అన్నీ కోల్పోయాం. నీటి విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. వైఎస్ ఉన్నప్పుడు మా కాలవకు 1.5 టీఎంసీ కేటాయించారు. చంద్రబాబు పుణ్యాన వర్షాలు లేక, డ్యాముల్లో నీళ్లు లేక అవీ రావడం లేదు. చివరకు జేసీ బ్రదర్స్ కలిపి అన్యాయం చేస్తున్నారు. 70 రోజులు ఇస్తామన్నారు, కనీసం 50 రోజులు కూడా రావడం లేదు. జగనన్న సీఎం అయితేనే మన రైతుల సమస్యలు తీరుతాయి

మల్లయ్య, ముత్యాల

నాకు 4 ఎకరాల భూమి ఉంది. పంట నష్టపరిహారం ఇవ్వలేదు. బ్యాంకులో 25 వేల రుణం ఉంది. అది కూడా మాఫీకాలేదు. వడ్డీలకే సరిపోతోంది. రూపాయి కూడా రాలేదు వడ్డీ భారం కూడా పడింది. అది కూడా కలిపి కట్టమంటున్నారు. పంటబీమా కూడా రాలేదు. ఈ సంవత్సరం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వబోమని అంటున్నారు. పబ్లిగ్గా బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు.. చంద్రబాబుకు ఏం చెబుతాం.
రామచంద్రరాజు, మేడిమాకులపల్లె

నాకు 8 ఎకరాల భూమి ఉంది. గోల్డ్ లోన్ 80 వేలు, క్రాప్ లోన్ 80 వేలు ఉంది. అందులో 12వేలు పోయిందన్నారు. మళ్లీ 8వేలు ఎదురు వడ్డీ కట్టాం. 2 రూపాయల వడ్డీ కట్టుకుంటున్నామన్నారు. ఆ పొద్దు ఆయన కట్టొద్దని అన్నారు కాబట్టి కట్టలేదు. ఇప్పుడు వాళ్ల పుణ్యాన అధిక వడ్డీ కట్టాల్సి వస్తోంది. బంగారం వేలం వేస్తామని నోటీసులు వస్తే భూములు తాకట్టు పెట్టి బంగారం విడిపించుకున్నాం. రైతుకు చక్రవడ్డీ పడుతోంది. పంటబీమా రూపాయి కూడా రాలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ రాదన్నారు. విత్తనాలు కూడా మొలకెత్తడం లేదు. ఈయనొస్తే మళ్లీ వర్షాలు రావు. మేం బతికుంటే మళ్లీ ఆయనకు మాత్రం ఓటు వేయం.

చంద్రావతి, డ్వాక్రా మహిళ

 మా గ్రూపులో 15 మంది ఉన్నాం. 5 లక్షల రుణం తీసున్నాం. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెబితే టీడీపీకి ఓట్లు వేశాం. చంద్రబాబు చెప్పినందుకు అప్పుకట్టలేదు. అయితే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మూడు నెలలకే 30 వేల వడ్డి వచ్చింది.

అనంతరం వైఎస్ జగన్.. రైతులతో మాట్లాడుతూ చంద్రబాబు పాపాలు పండుతాయన్నారు. ప్రజలను ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజులు వస్తాయని, దేవుడు పైనుంచి చూస్తున్నాడని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement