
17న తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన
కాకినాడ : ప్రతిపక్ష నేత, వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొండంగిలో ‘దివీస్’ వ్యతిరేక పోరాటానికి ఆయన ఈ సందర్భంగా మద్దతు తెలుపనున్నారు. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం వెల్లడించారు. దివీస్ ఉద్యమంలో గాయపడ్డ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆ భూముల్లోకి ప్రవేశించి పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. దానవాయిపేట పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ప్రభుత్వం దివీస్ లేబొరేటరీస్‌కు 505 ఎకరాలు కేటాయించింది. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గాలి, నీరు, నేల కలుషితమై తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు భూములిచ్చేది లేదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు.
అయినా భూసేకరణకు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో స్థానికుల ఆందోళనలు, నిరసనలు ఉధృతం అయ్యాయి. దీంతో తొండంగి పరిసర ప్రాంత గ్రామాల్లో రెండున్నర నెలల క్రితం విధించిన 144వ సెక్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ దానవాయిపేటలో దివీస వ్యతికేక పోరాటకమిటీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సభలో పాల్గొనేందుకు వచ్చినవారిని పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసి, అరెస్ట్‌లు చేశారు.