Meet Murali Divi, The Billionaire Scientist Who Has A Net Worth Of 5.8 Billion Dollars - Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫెయిల్‌, రూ.500తో అమెరికాకి పయనం.. కట్‌ చేస్తే 47 వేల కోట్లకు అధిపతి!

Published Tue, May 9 2023 1:21 PM | Last Updated on Tue, May 9 2023 3:40 PM

Meet Murali Divi, The Billionaire Scientist Who Has A Net Worth Of 5.8 Billion - Sakshi

ఏదో సాధించాలనే తపన..ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాల ఎత్తు ఎదగాల్సిన విద్యార్థులు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని,ఫెయిల్‌ అయ్యామని మరొకరు ఇలా.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల‍్పడుతుంటుంటారు.

అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆగి, తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి. తిరిగి పచ్చగా కళకళలాడతాయని అంటున్నారు మురళి దివి. నాడు ఇంటర్‌ రెండు సార్లు ఫెయిల్‌ అయ్యారు. చేతిలో రూ. 500తో అమెరికాకు వెళ్లారు. కట్‌ చేస్తే నేడు వేల కోట్ల అధిపతిగా ఎదిగారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు దివిస్ లేబరేటరీస్‌ అధినేత దివి మురళి కృష్ణ ప్రసాద్‌.  

చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్‌ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?

మురళి దివి ఎవరు?
ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. తనకు వచ్చే 10 వేల రూపాయల పెన్షన్‌తో 13 మంది పిల్లల్ని పోషించేవారు. అయినప్పటికీ తన కష్టాన్ని పిల్లలకు తెలియనీయకుండా పెంచారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని శ్రమించారు. కానీ మురళి దివికి ఇంగ్లీష్‌ అంటే చాలా భయం. ఆ భయమే ఆయనను ఇంటర్మీడియట్‌లో రెండు సార్లు ఫెయిల్‌ అయ్యేలా చేసింది.

వృద్దిలోకి వస్తారనుకున్న కొడుకు ఇలా ఫెయిల్‌ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పుడే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందనే సూక్తిని గట్టిగా నమ్మారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని కుంగిపోలేదు. ప్రయత్నించారు. చివరికి విజయమే మురళి దివికి బానిసైంది.

అందరూ సంపన్నులే.. కానీ తాను మాత్రం
ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అప్పటికే మణిపాల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్న తన సోదరుడి వద్దకు పంపారు. అదే ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో చేరారు. అంతర్జాతీయ యూనివర్శిటీ కావడంతో దేశ, విదేశీ విద్యార్ధులు అందులోనూ సంపన్నులు. కానీ తన కుటుంబ నేపథ్యం అందుకు విభిన్నం. ఉన్నత చదువుల కోసం నాన్న, తోబుట్టువులు చేసిన మేలు మరిచిపోలేదని ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎలాగైనా వారి కష్టానికి ప్రతిఫలంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. రేయింబవళ్లు శ్రమించారు. అలా బ్యాచిలర్‌ డిగ్రీలో యూనివర్సిటీలోనే గోల్డ్ మెడలిస్ట్‌ సంపాదించారు. అదే యూనివర్సిటీలో బెస్ట్‌ స్డూడెంట్‌గా గోల్డెన్‌ అవార్డ్స్‌తో మాస్టర్స్‌ను పూర్తి చేశారు.

జీతం రూ.250లే 
పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. వార్నర్స్ హిందుస్థాన్ కంపెనీలో రూ. 250 జీతంతో కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో, అమెరికాలో ఫార్మసిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లు అమెరికా వీసా పొందడం సులభం. అలా అమెరికా వెళ్లేందుకు ప‍్రయత్నించారు. యూనివర్సిటీలో గోల్డ్‌ మెడలిస్ట్‌ కావడంతో  వీసా దొరికింది. వెంటనే గ్రీన్ కార్డ్ సంపాదించారు. 

చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. డబుల్‌ శాలరీలను ఆఫర్‌ చేస్తున్న కంపెనీలు!



చలో అమెరికా
కానీ వీసా ఆమోదం తర్వాత మురళికి అమెరికా వెళ్లడానికి 9 నెలలు పట్టింది. 1976-77 సమయంలో తన భార్య, కుమారుడితో కలిసి చేతిలో రూ.500లతో అమెరికాకు పయనమయ్యారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సైంటిస్ట్‌గా పనిచేశారు. తర్వాత కాస్మోటిక్‌ ఫార్మాస్యూటికల్‌ ప్లాంట్‌ సూపరింటెండెంట్‌ అయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతు ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జీతం నెలకు రూ.నాలుగున్నర లక్షలకు పెరిగింది.

జీవిత భాగస్వామి అంగీకారంతో
అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మురళికి ఓ ఆలోచన వచ్చింది. నేను నా కుటుంబ సభ్యులకు, నన్ను కన్న నా దేశానికి దూరంగా ఉంటూ ఇక్కడే ఎందుకు పనిచేయాలి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. వెంటనే భారత్‌కు వచ్చేయాలని అనుకున్నారు. చివరికి జీవిత భాగస్వామి అంగీకారంతో మురళి భారత్‌కు వచ్చారు. 

చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్‌, గూగుల్‌ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే?


డాక్టర్ అంజిరెడ్డితో పాటు
తిరిగి వచ్చిన తర్వాత, ఏం చేయాలో తెలియదు. వ్యాపారం ప్రారంభించాలంటే అంత డబ్బు కూడా లేదు. అమెరికాలో సైంటిస్ట్‌గా సంపాదించిన అనుభవాన్నే ఆస్తిగా మరల్చుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకులు డాక్టర్ అంజి రెడ్డిని సంప్రదించారు. తాను భారత్‌లో ఓ కంపెనీని పెట్టాలని అనుకుంటున్నట్లు తన ఐడియాను వివరించారు. ఆ ఆలోచనకు అంజిరెడ్డి సైతం అకర్షితులయ్యారు. అతని సహకారంతో 'కెమినార్'  అనే కంపెనీని కొనుగోలు చేశారు.

 దేశంలోని ప్రముఖ ఫార్మా తయారీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు భారీగా పెట్టారు. కానీ ప్రయాణం అంత సులభం కాదు. అయితే, ధైర్యం, 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' (బలవంతులదే మనుగడ) నినాదంతో ముందుకు సాగారు. చేసి చూపించారు. ఆ సమయంలో ప్రముఖ వ్యాపార వేత్తలలో ఒకరిగా నిలిచారు. 

దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ
దేశంలోని డిమాండ్లను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్లను ప్రారంభించారు. ఆ అనుభవంతో, సొంతంగా కంపెనీ పెట్టాలనే కోరికతో 1990లో హైదరాబాద్‌లో ‘దివీస్ లేబొరేటరీస్’ ప్రారంభించారు. ఏఐపీఐలు, ఇంటర్మీడియట్ల తయారీకి, వ్యాపారానికి అనుగుణంగా అభివృద్ది చేయడం ప్రారంభించారు. అలా 1995లో మురళి దివి తెలంగాణలోని చౌటుప్పల్‌లోని తన తొలి తయారీ కేంద్రాన్ని, 2002లో విశాఖ సమీపంలో రెండో యూనిట్‌ ప్రారంభించారు.

బిలియనీర్‌గా ఎదిగారు..
దివీస్‌ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, 2013లో మురళి బిలియనీర్ అయ్యారు. 2018-19లో అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ భారీగా పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, మురళీ దివి నికర సంపద 5.9 బిలియన్‌ డాలర్లతో  ప్రపంచంలోని 448వ ధనవంతులుగా నిలిచారు.

చదవండి👉 యాపిల్‌ కంపెనీలో వందల కోట్ల మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement