నల్లమలలో యువనేత
రాజన్న కుమారుడు వైఎస్ జగన్ శ్రీశైలం వెళ్తున్నారనే సమాచారం తెలుసుకున్న నల్లమల ప్రాంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు హాజీపూర్ చౌరస్తా వద్దకు తండోపతండాలుగా తరవచ్చారు. జగన్ రాకకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. జననేత రాగానే పూలమాలలు వేసి, కరచాలనం చేసి అభిమానం చాటుకున్నారు.
అచ్చంపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తాలో పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లుతున్న ఆయన ఉదయం11 గంటలకు హాజీపూర్‌కు చేరుకున్నారు. చౌరస్తాలో ఉన్న వైస్సార్ సీపీ నేతలను చూసి వాహనం నిలిపారు. కాబోయే సీఎం వైఎస్ జగన్ అని కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. వాహనంలో నుంచి ఆయన కిందకు దిగగా కార్యకర్తలు, నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ కలిసేందుకు ప్రయత్నించారు. తోపులాటతో వైఎస్‌ను అంగరక్షకులు చుట్టముట్టి వాహనం ఎక్కించారు. వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల అధ్యక్షుడు భగవంతురెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. అధ్యక్షుడు కలుస్తుండగానే జగన్ అభిమానులు తోసుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో అచ్చంపేట నియోకవర్గ నేతలు కొండూరు చంద్రశేఖర్, తోకల శ్రీనివాస్‌రెడ్డి, మంజూరు అహ్మద్ పాల్గొన్నారు.
జననేత అభివాదం
మన్ననూర్: నల్లమల సరిహద్దు ప్రాంతం మన్ననూర్ మీదుగా శ్రీశైలం వెళ్లిన జననేతను చూసేందుకు తరలొచ్చి
రోడ్డుపై వేచి ఉన్న ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి అభివాదం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా యాత్రను ప్రారంభించేందుకుగాను ఆయన రోడ్డు మార్గం గుండా శ్రీశైలం వెళ్లారు. జగన్ వస్తున్న సమాచారం తెలుకున్న ప్రజలు మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెం ట, ఈగలపెంట, పాతాలగంగ వద్ద నీరాజనాలు పలికారు. అమ్రాబాద్ మండలం ఈగలపెంట పోలీసులు రోడ్డు భద్రతలో భాగంగా మండల సరిహద్దు మూలమలుపు నుంచి చెరువు కొమ్ము లింగమయ్యస్వామి ఆలయం సమీపంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వరకు ఎస్కార్ట్‌గా వెళ్లారు.