
22న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో యువభేరి జరగనున్నట్లు కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం వెల్లడించారు. యువభేరి ఏర్పాట్లపై నియోజకవర్గాల కన్వీనర్లతో ఎమ‍్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, పార్టీ నేతలు ఆళ్ల నాని తదితరులు చర్చించారు.
అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు ...బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టారన్నారు. కేంద్ర సాయంతో సంతృప్తి చెంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.