
ఇంటికో విమానం ఇస్తామని చెబుతాడు
పులివెందుల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ‍్డి అన్నారు. శుక్రవారం ఇడుపులపాయ గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని, మొత్తం లక్షా 45 వేల కోట్ల రూపాయల అవినీతికి శ్రీకారం చుట్టారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని వైఎస్ జగన్ చెప్పారు. హామీలపై చంద్రబాబును నిలదీయాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని అన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఇంటికో కారు లేదంటే ఏకంగా విమానమే ఇస్తామని చంద్రబాబు చెబుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రజలకే బ్యాలెట్ ఇస్తున్నామని, వంద మార్కులకు ఎన్ని మార్కులు వేస్తారో చెప్పాలని కోరుతామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పటివరకు ఎవరికీ రుణాలు మాఫీ చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు. మోసం చేసేవారిని ఎక్కడికక్కడ నిలదీస్తేనే మార్పు వస్తుందని అన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో ప్రతిచోటా తాను పాల్గొంటానని చెప్పారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలో ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తారని వైఎస్ జగన్ తెలిపారు.