హామీలను అటకెక్కిస్తున్న బాబు
‘గడప గడపకు వైఎస్సార్’లో పేదల ఆవేదన
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని జిల్లావాసులు పలువురు వాపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ‘గడప గడపకు వైఎస్సార్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని ప్రజలు వెళ్లగక్కారు.
ముస్లింలకు సహాయం ఎక్కడ...
నందిగామ నియోజకవర్గం మూడవ వార్డు మయూరి థియేటర్ ప్రాంతంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుడు షేక్‌బాషాతో పాటు పలువురు ముస్లింలు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి పేద ముస్లింలను వివాహ సమయంలో ఆదుకుంటానని సీఎం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలు గడిచి రెండున్నర ఏళ్లు అయినా ఒక పేద ముస్లింకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ ఊసే లేదు..
ఎన్నికల సమయంలో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే రుణమాఫీ జరుగుతుందని ప్రచారం జరపడంతో తమ గ్రూపు సభ్యులు రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నామని అయితే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదని నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీ పేర్లవానిలంకకు చెందిన పేర్ల కుమారి వాపోయింది. గడప గడపకు వైఎస్సార్‌లో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు పేర్లవారిలంకలో పర్యటించినప్పుడు మహిళలు ఆయన్ను కలిసి ఇప్పుడు తమ అప్పుతీర్చమని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
రేషన్ కార్డులు ఇచ్చారు...సరుకులు లేవు..
తిరువూరు ఎమ్మెల్యే కె. రక్షణనిధి విసన్నపేట మండలం పుట్రాల గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఎం.పుల్లయ్య అనే స్థానికుడు కలిసి ఇటీవల జరిగిన జన్మభూమి సభలో రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చారు కానీ సరుకులు రావడం లేదని ఆరోపించారు. దీనిపై రక్షణనిధి స్పందిస్తూ అధికారులతో మాట్లాడి సరుకులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
కాగా ముత్తారావు అనే రైతు ఆయన్ను కలిసి ఈ ఏడాది తమకు సాగునీరు చుక్కరాలేదని వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ సాగర్ కాల్వ నుంచి నీరు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త కె. పార్థసారథి గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కరీమున్నిస్సా అనే మహిళ కలిసి ఇచ్చే రెండు మూడు రేషన్ సరుకుల కోసం నగదు రహితమని, వేలిముద్రలు, ఐరీస్‌లు అంటూ నానా ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. గతంలో ఇటువంటి పరిస్థితి లేదని చంద్రబాబు వచ్చిన తరువాత తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.
పింఛన్ ఇవ్వడం లేదు...
కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు కలిదిండి మండలం కోరుకల్లు గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహిస్తుంటే 8వ తరగతి విద్యార్థి రేపూరి సురేష్ అనే రెండు చేతులు లేని వికలాంగుడు కలిశారు. వికలాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై నాగేశ్వరరావు స్పందిస్తూ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.