అపరభగీరథుడు వైఎస్సారే
అపరభగీరథుడు వైఎస్సారే
Published Mon, Jan 16 2017 10:59 PM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
- ప్రజల హృదయాల్లో ఆయనకు చెరగని స్థానం
- ప్రాజెక్టుల గేట్లు ఎత్తి క్రెడిట్ కొట్టేయాలని బాబు ఆరాటం
- విలేకరుల సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే
నెహ్రూనగర్(పగిడ్యాల): దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా జలయజ్ఞం పథకం కింద 86 ప్రాజెక్ట్‌లను చేపట్టి అందులో 60 ప్రాజెక్ట్‌లకు పైగా పూర్తి చేసి అపరభగీరథుడిగా ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారని ఎమ్మెల్యే వై. ఐజయ్య పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని నెహ్రూనగర్ మూర్వకొండ ఘాట్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. సింగోటం జాతరకు వెళ్లే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రాయలసీమకు జీవనాడీగా భావించే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వైఎస్ స్వప్నం అన్నారు. ఆయన హయాంలోనే పథకానికి శంకుస్థాపన చేసి సుమారు రూ. 120 కోట్ల పనులు పూర్తి చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తి క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. పనులు పూర్తి చేయకుండానే రెండుపంపులతో హడావుడిగా జనవరి 2న ముచ్చుమర్రిని జాతికి అంకితం చేయడం బాధాకరమన్నారు.
చంద్రబాబు ప్రస్తుతం కుల రాజకీయాలకు తెర లేపారని, అందుకు అనంతపురం ఎంపీ జేసీని పావుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా శంకుస్థాపన చేయని బాబు అపరభగీరథుడు ఎలా అవుతాడని విమర్శించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నందికొట్కూరు నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రబీ పంటలకు సాగునీరు ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలన్నారు. రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టిరెడ్డి, పి. మధు, వాసు, బాషా, పక్కీరయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Advertisement