సీమ ప్రాజెక్టులపై చిన్నచూపు
సీమ ప్రాజెక్టులపై చిన్నచూపు
Published Mon, Oct 24 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
– సిద్ధేశ్వరం తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం
– రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్
కోవెలకుంట్ల: రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రాయలసీమ జేఏసీ కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖర్ శర్మ ఆరోపించారు. గుండ్రేవుల, గురురాఘవేంద్ర, వేదవతి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కోవెలకుంట్ల జేఏసీ కో ఆర్డినేటర్ కామని వేణుగోపాల్‌రెడ్డి స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో పట్టీసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రభుత్వం మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సార్బీసీపై మాత్రం అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సీమలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు లేకపోవడం విచారకరమన్నారు. తగినన్నీ రిజర్వాయర్లు లేక కేసీకి కేటాయించిన 39.9 టీఎంసీల నీటిని కూడా సీమ రైతులు వాడుకోలేకపోతున్నారన్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం రిజర్వాయర్లను పూర్తి చేయకపోవడంతో నీరు నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి వేల ఎకరాల అటవీ భూములకు యుద్ధప్రాతిపదికన అనుమతులు తెచ్చిన ప్రభుత్వం అవుకు రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు అడ్డంకిగా ఉన్న అటవీశాఖ భూముల నుంచి అనుమతి లభించలేదని పెండింగ్‌లో ఉంచడం దుర్మార్గమైనచర్యగా అభివర్ణించారు. కుందూనదిపై జోళదరాశి వద్ద 0.8 టీఎంసీ, రాజోలి వద్ద 3 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్ల ఏర్పాటుకు రూ. 533 కోట్లు నిధులు మంజూరైనా నిర్మాణాలను పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ సిద్ధేశ్వరం ఉద్యమ తరహాలో మరో పెద్ద ఉద్యమానికి జేఏసీ సిద్ధమవుతోందని హెచ్చరించారు. కుందూపోరాటసమితి, రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ జేఏసీ, ఇతర రైతు సంఘాలతో రైతు చైతన్య పరిచే యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జేఏసీ బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు రామచంద్రుడు పాల్గొన్నారు.
Advertisement