దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే కేసులా?
– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజం
పరిగి (పెనుకొండ రూరల్ ) : అధికారులపై టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం పరిగి మండలం కొడిగెనహళ్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో టీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
టీడీపీ నాయకుల దౌర్జన్యాలపై ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తే కేసులు నమోదు చేసి, హింసించడం దారుణమన్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులను ప్రజలు ప్రశ్నిస్తే వారి ఇళ్లు, పింఛన్లు తొలగిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపార్టీ నాయకులు ప్రజల పక్షాన మాట్లాడే అర్హత లేదా ?అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు అసెంబ్లీని నడుపుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.