ప్లీనరీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
హంద్రీ- నీవా పథకాన్ని చేపట్టి అనంతపురం జిల్లాకు 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన అపర భగీరథుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శంకర నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా సమస్యలపై ఆయన వైఎస్సాసీపీ జాతీయ ప్లీనరీలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. జిల్లాలోని 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని కొనియాడారు. అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ-నీవా పథకానికి రూపకల్పన చేసి, తద్వారా డిస్ర్టిబ్యూటరీల ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారన్నారు.
అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ- నీవా ద్వారా కేవలం రిజర్వాయర్లును నింపేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో తీసుకున్న మేరకు హంద్రీ-నీవా ద్వారా డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాకు ఇచ్చిన 21 హామీల నెరవేర్చాలన్నారు.
అనంతపురం జిల్లా ప్రతి ఏడాది కరువు, కాటకాలతో అల్లాడిపోతోందని, వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో కరువుతో సతమతమయ్యే అనంత రైతాంగాన్ని ఆదుకునేందుకు పాడిపరిశ్రమను అభివృద్ధి చేశారన్నారు. అదేవిధంగా హార్టికల్చర్‌ను ప్రోత్సహించేందుకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ర్పింక్లర్లు ఇచ్చి ఆదుకున్నారన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. వేరుశనగ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలయ్యేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల అనంతపురం జిల్లా రైతులు కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్లి తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేస్తున్నారనీ, అలాంటి వారిని ఆదుకునేందుకు స్థానికంగానే ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.
‘అనంత’కు నీళ్లిచ్చిన అపర భగీరథుడు వైఎస్సార్
Published Sat, Jul 8 2017 11:25 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement