
మోసకారి బాబుకు ఓటుతో బుద్ధి చెబుదాం
జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి గద్దెనెక్కిన అనంతరం ఉన్న జాబులు ఊడగొడుతూ యువతను చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.
పుట్టపర్తి టౌన్ : జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి గద్దెనెక్కిన అనంతరం ఉన్న జాబులు ఊడగొడుతూ యువతను చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని కోటా గార్డెన్స్‌లో శనివారం పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కరువు జిల్లాకు వేలాది పరిశ్రమలు తెచ్చి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పెద్దలు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా తీసుకొచ్చిన పాపానపోలేదన్నారు.
ఇక్కడ చదువుకున్న పట్టభద్రులు, యువకులు ఇతర రాష్ట్రాలకు వలసలు పోయి కూలీలుగా పనిచేయాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. చంద్రబాబుతో పాటు వచ్చిన కరువు మూడేళ్లుగా జిల్లా రైతుల్ని కుంగదీస్తోందని, జిల్లా రైతులు కేరళలో బిచ్చగాళ్లుగా మారుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి పెద్దలు చట్టం చేస్తే, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం హోదాను తాకట్టు పెట్టి, ప్యాకేజీతో తాను, తన కార్యకర్తలతో పండుగ చేసుకుంటున్నాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ జిల్లా నుంచి సమర్థుడైన వ్యక్తిని చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వెన్నపూసగోపల్‌రెడ్డికి ప్రతి పట్టభద్రుడు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై, ప్రజా పోరాటాలపై చంద్రబాబు ప్రభుత్వానికి గౌరవం కూడా లేదన్నారు. మదమెక్కిన ప్రభుత్వం మెడలు వంచేందుకు విద్యావంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ మేయర్ రాగేపరుశురాం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మాధవప్ప, జాయింట్ సెక్రెటరీ లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు ఏవి.రమణారెడ్డి, నరసారెడ్డి, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, ఈశ్వరయ్య, రాంజీనాయక్, పుట్టపర్తి పట్టణ, రూరల్, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓడీసీ, అమడగూరు మండలాల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, జగన్‌మోహన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేషూరెడ్డి, రామాంజనేయులు, వివిధ మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.