భగ్గుమన్న రాష్ట్రం | ysrcp hegitations over pa special issue all around state | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న రాష్ట్రం

Published Sat, Oct 24 2015 2:32 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

శుక్రవారం కర్నూలులో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న ఎంపీ బుట్టా రేణుక, ఇతర - Sakshi

శుక్రవారం కర్నూలులో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న ఎంపీ బుట్టా రేణుక, ఇతర

- ప్రత్యేక హోదా కోరని చంద్రబాబు వైఖరికి నిరసన
- ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలను మట్టిలో కలిపేశారంటూ విమర్శలు
- వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమించిన ప్రజలు
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, మానవహారాలు, ర్యాలీలు.. చంద్రబాబు, మోదీ దిష్టి బొమ్మల దహనం
- ఏపీ నోట్లో మట్టి కొట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీని పట్టించుకోని వైనం
- ప్రత్యేక హోదాపై తొలినుంచీ అనాసక్త ధోరణిలో సీఎం
- ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి నష్టనివారణ చర్యలు
 
(సాక్షి  ప్రత్యేక ప్రతినిధి):
విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సంజీవనిగా నిలుస్తుందన్న ప్రత్యేక హోదా గురించి  ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట మాట మాత్రమైనా ప్రస్తావించని సీఎం చంద్రబాబు వైఖరికి నిరసనగా రాష్ట్రం భగ్గుమంది. 16 నెలలుగా ఎంతో
 ఆశగా ఎదురుచూసినా, తమ ఆశలను అడియాశలు చేసి, తమ ఆకాంక్షలను మట్టిలో కలిపేశారంటూ రాష్ట్ర ప్రజలు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు నిర్వహించారు.

రాష్ర్టవ్యాప్తంగా మానవహారాలు, ర్యాలీలు నిర్వహించి సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ర్ట ప్రజల భవిష్యత్తుతో బంతాట ఆడుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చివరకు ప్రజల ఆకాంక్షలపై గుప్పెడు మట్టి కొట్టారని, యువతరం ఆశలపై చెంబెడు నీళ్లు చల్లారని మండిపడ్డారు. తమ బిడ్డల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ఎదుట ముఖ్యమంత్రి మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

అట్టహాసంగా రూ.400 కోట్లు ఖర్చుపెట్టి గురువారం నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రత్యేకహోదాపై పెదవి విప్పని ముఖ్యమంత్రి తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం సొంత కేసుల నుంచి బయటపడటానికి ప్రత్యేక హోదా అంశాన్ని అమ్మేశారని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా వస్తుందని ఎదురుచూసిన అయిదు కోట్ల రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా రావాల్సిన విభజన చట్టంలోని హామీలకే ప్రత్యేక ప్యాకేజీ అనే కొత్త పేరు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర విపక్ష నేతలు నేతలు కూడా చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

ఏపీ నోట్లో మట్టి
విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు విభజన చట్టంలో అనేక హామీలివ్వడంతోపాటు, ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రజలు 16 నెలలుగా ఎదురు చూశారు. కానీ ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ప్రణాళికా సంఘం ఒప్పుకోవడంలేదంటూ, ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు చెబుతున్నాయంటూ కేంద్రం ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చింది.

ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్యనాయుడు, 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎన్నికల సభల్లో మాట్లాడిన చంద్రబాబు... ప్రత్యేకహోదా సంజీవని కాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు హోదాకోసం ఉద్యమించారు, కొందరు బలిదానం చేశారు. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ... ఆ వేదికగా ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేస్తారని వేయికళ్లతో ఎదురు చూశారు. వారి ఆశలు అడియాశలయ్యాయి. హోదా సాధించాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి అసలు ఆ ప్రస్తావనే తీసుకురాకపోగా... ప్రధాని సైతం హోదాపై పెదవి విప్పలేదు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కలిసి ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టి కొట్టారని తీవ్రంగా మండిపడుతున్నారు.

హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాటవేత ధోరణి ఆందోళన కలిగిస్తోందని సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలకు ముందు 15 ఏళ్లు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు గొంతు ప్రధాని ముందు ఎందుకు మూగబోయిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ప్రధాని, ముఖ్యమంత్రి కలిసికట్టుగా ప్రజల ముఖాన మట్టి, నీళ్లు చల్లారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటుచేసి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, వంద శాతం పారిశ్రామిక రాయితీలు ఇవ్వండని ఒక ముక్క కూడా చంద్రబాబు మాట్లాడకపోవడాన్ని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తప్పుపట్టారు.
 
ఆదినుంచీ అదే ధోరణి...
ప్రత్యేకహోదా సాధనపై చంద్రబాబుకు మొదటినుంచీ చిత్తశుద్ధి లేదని, అందుకే రాష్ట్రానికి దక్కిన హక్కు, ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకురాకుండా దాటవేశారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ అనబోయి స్పెషల్ ప్యాకేజీ అన్నానని సీఎం చెప్పడం హాస్యాస్పదమని విమర్శిస్తున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం రూ.400 కోట్ల ఖర్చుతో అట్టహాసంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో నిర్వహించింది. ఒకే రోజు రెండు పండుగలు.. విజయదశమి, అమరావతి శంకుస్థాపనలను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించారు.

కానీ ఏడాదిన్నర కాలంగా ఐదుకోట్ల ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్న, అత్యంత కీలకమైన ప్రత్యేక హోదాపై పట్టుబట్టకపోగా, అసలు ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై మట్టిగొట్టారు. ప్రత్యేకహోదా సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదినుంచీ అనాసక్త ధోరణినే ప్రదర్శిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని ప్రకటించిన ప్రత్యేకహోదాను సాధించడం మరచి, ప్రత్యేకహోదా సంజీవని కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐదు నిమిషాల పాటు అనర్గళంగా చేసిన ఉపన్యాసంలోనూ ప్రత్యేక ప్యాకేజీ అన్నారే తప్ప ప్రత్యేకహోదా గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు.

గతంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ లోక్ సభ, రాజ్యసభల్లో ఏపీకి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన విషయాన్ని సైతం ప్రధానికి గుర్తు చేయలేదు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కలిగే లాభాలను వివరించటం ద్వారా ప్రధానికి ఆకర్షించేందుకు ప్రయత్నించాల్సిన చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా గత ఎనిమిది నెలల్లో ఎన్నో నిధులు మంజూరు చేసి ఏపీని ఆదుకున్నారన్న రీతిలో ప్రధానిని పొగ డ్తలతో ముంచెత్తారు.

బహిరంగ సభ వేదిక ద్వారా ప్రధానిని ఆకర్షించాలని సీఎం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షంపై విమర్శలు చేసేందుకు ఉపయోగించుకున్నారు. విభజన వల్ల జరిగిన నష్టాలనే పదే పదే ప్రస్తావించటం ద్వారా మానిపోతున్న గాయాలను తిరగదోడేందుకు ప్రయత్నించారు. హోదాపై ముఖ్యమంత్రి ఏమీ అడగ్గపోవడంతో చివరగా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ప్రసంగంలో ఆ మాటెత్తలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ , అమృత్‌ల గురించి ప్రస్తావించి సరిపెట్టేశారు.
 
కంటితుడుపు చర్యలు...
ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి ధోరణి, ప్రధాని వైఖరికి నిరసనగా రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమనడంతో తెలుగుదేశం నేతలు నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా విలేకరుల సమావేశం పెట్టి... తాను ప్రత్యేక హోదా అడగాలనే అనుకున్నాననీ, కానీ పొరపాటున ప్రత్యేక ప్యాకేజీ అన్నానని మభ్యపెట్టే ప్రయత్నంచేశారు. ప్రధాని మోదీ ప్రత్యేకహోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకపోవడంపై తాము కూడా అసంతృప్తిగానే ఉన్నామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రధాని ప్రకటించారని, అలాగే ప్రత్యేక హోదా కూడా ఇస్తారని టీడీపీ నేతలు సర్దిచెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకాలం ప్యాకేజీ పాట పాడిన నేతలు సైతం... ప్రత్యేకహోదాకోసం తాము ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరు తమను ఉత్సాహపరిచినప్పటికీ... హోదా, ప్యాకేజీ విషయంలో ప్రకటన రాకపోవడం తమలో నిరాశ నింపిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇవ్వాలని చంద్రబాబు అడిగి ఉంటే ప్రధాని ఏ విధంగా స్పందించేవారోనని, అడగకపోవడంవల్ల రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement