'అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పుకాదట'
చింతపల్లి: తన బంధువులు, టీడీపీ నాయకులకు లాభం చేకూర్చేందుకే ఏపీ సీఎం చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో గురువారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
విపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు వ్యతిరేకించారని ఆమె గుర్తు చేశారు. తవ్వకాల వల్ల గిరిజనులకు, పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని 2011లో ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారని, నిన్నమొన్నటివరకు ఈ లేఖ టీడీపీ వెబ్ సైట్ లోనూ ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి బాక్సైట్ తవ్వకాలు తప్పుకాదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
97 జీవో విడుదల చేసి గిరిజనుల అభివృద్ధి కోసమేనని చెప్పడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిజంగా గిరిజనులపై ప్రేమవుంటే గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు బాసటగా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని హామీయిచ్చారు.