బాబు హామీలన్నీ ఉత్తుత్తివే..
♦ అన్నా ఏదీ నిరుద్యోగ భృతి
♦ యువతను మభ్యపెడుతు న్నారంటూ జనం ఆగ్రహం
♦ ‘గడపగడపకు వైఎస్సార్’లో సమస్యలు ఏకరువు
కడప అగ్రికల్చర్: ఎన్నికల సమయంలో ఉద్యోగం లేని యువతకు తప్పనిసరిగా తమ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు తర్వాత ఆ విషయాన్నే అటకెక్కించారని నిరుద్యోగ యువత మండిపడుతోంది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న నేతలతో ప్రజలు తమ బాధలను ఏకరువుపెడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని లింగాపురం, మేలనూతల, సుగాలితాండా, గుర్రప్పకోన గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి హనుమంతరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివగురివిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు సుద్దపల్లె శివుడు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ పార్టీ తయారుచేసిన కరపత్రాన్ని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా లింగాపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు ఆదిరెడ్డి మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడంతో ఎంతో ఆశపడ్డామన్నారు.
తీరా అధికారపీఠంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్చొగానే ఆ భృతి మాటే అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలం టంగుటూరు, గట్టుమీదపల్లె, మదన మోహనపురం గ్రామాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సర్పంచ్ నరసింహులు, పార్టీ జిల్లా సలహా కమిటీ సభ్యుడు దినేష్, పరిశీలకుడు సౌమిత్రి గ్రామంలో ప్రజలను కలుసుకుని ప్రభుత్వ పాలన తీరును అడిగి తెలుసుకునే సందర్భంలో వ్యవసాయ ఉప ఉత్పత్తుల తయారీ కోసం చిరు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే స్థలాలు, సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి ఆ తర్వాత ఏ విషయం చెప్పకుండా పథకాలను మూలనపడేశారని గ్రామానికి చెందిన యువకుడు ప్రసాద్ నాయకుల ఎదుట వాపోయారు.
అదేవిధంగా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లె, చెంచుకాలనీ, ఆంతోని స్కూలు ప్రాంతాల్లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ఎంపీపీ విజయ్‌ప్రతాప్‌రెడ్డి, పార్టీ సమన్వయకర్త వెంకటసుబ్బయ్య, పార్టీ బద్వేలు అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, సింగిల్‌విండో అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా అంకయ్యనాయుడు వీరితో మాట్లాడుతూ పథకాలన్నీ అమలుకావడం లేదని, కేవలం రాజధాని పేరుతో ప్రభుత్వం కాలం వెల్లదీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి మండలం నగిరిపాడు పంచాయతీలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మనందరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులరెడ్డిలు ఇటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధురాలు అనంతమ్మ మాట్లాడుతూ వేలిముద్రలు పడలేదని పింఛన్ నిలిపివేశారని, రేషన్‌కార్డు తొలగించారని ప్రభుత్వంపై మండిపడ్డారు.