అదే బాబు.. అదే ‘ట్రాక్’
పాత పాటలు విందాం రండి ఇంకోసారి!
‘‘బాబొస్తే జాబొస్తుందా?’’ ‘‘అదేదో తూర్పునే తెల్లారుతుంది అన్నంత ధీమాగా చెబుతున్నారు గానీ... ఆ మాట నమ్మితే తెలివి తెల్లారినట్టే అవుతుంది.’’ ‘‘అదేంటీ? అంతమాట అన్నావ్?’’ ‘‘ఏదైనా అంశాన్ని వాస్తవమా కాదా చూడాలంటే తార్కాణా లో, ట్రాక్ రికార్డులో చూ స్తారు. ఇది నిజమయ్యే అవకాశం ఉందాని పరిశీలిస్తారు. మనమూ అదే చేద్దాం’’
‘‘అంటే...?’’
‘‘రీసెర్చికి ఒక సబ్జెక్టు ఎంచుకున్న తర్వాత, కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుకోవాలా, వద్దా?’ ‘‘ఎంతచెడ్డా రీసెర్చ్ స్కాలర్‌ననిపించుకున్నావ్. కూర్చుకోవాలీ, పేర్చుకోవాలి..అన్నం వండి వార్చుకోవాలిగానీ.. విషయం చెప్పు’’ ‘‘ఏం లేదు. ఒక వ్యక్తికి జాబ్ ఇవ్వాలంటే ఎవర్ని రాబ్ చేసి ఇవ్వాలి జీతం అనే దృక్పథం మన బాబుది. అందుకే తన హయాంలో ఓట్లకు పనికొచ్చే డీఎస్సీలే తప్ప బీఎస్సీ, ఎమ్మెస్సీల ఉద్యోగాలు కానలేదు బాబు. పైగా ఒక వ్యక్తిని ఫుల్‌టైమ్ ఉద్యోగంలోకి తీసుకోవాలంటే జాబు బెనిఫిట్లు ఇవ్వాలి కాబట్టి ఎవరూ అందుకు ఫిట్ కారంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులనే కొత్త కేటగిరీని సృష్టించిందెవరు? ఆ బాబే కదా. అలాంటిది సదరు బాబు తన జేబు నుంచి జాబులు తీసి ఉదారంగా పంచుతారంటే నమ్మేదెవరు? పైగా ఇంటికొకటట’’ ‘‘మరి బాబు తన జేబు నుంచి తీసి జాబు పం చరంటావా? ఆ మాటలు పంక్చరేనంటావా?’’ ‘‘బాబొస్తే జాబు రావడం ఎలా ఉన్నా జేబు కట్ కావడం మాత్రం ఖాయం’’ ‘‘మళ్లీ ఇదేంటి కొత్తగా?’’ ‘‘కొత్తగా ఏం లేదు. అంతా పరమ పాతవే’’
‘‘అదేమిటీ?’’
‘‘పాత ట్రాక్ రికార్డే మళ్లీ ప్లే చేసి చూద్దామా? అప్పట్లో పొలాలకు నీళ్లు సప్లై చేయాలంటే నీటి తీరువా అంటూ నీళ్లపైనా పన్నేసిందెవరు? దవఖానాల్లో ‘యూజర్ ఛార్జీలు’ వసూలు చేసిందెవరు? మన బాబే కదూ. అప్పట్లో కరెంటు ఛార్జీలు పెంచి జేబులు కత్తిరించిందెవరు. మనబాబే కదూ. ఇదేమిటంటూ అడగబోతే బషీర్‌బాగులో బందూకుల మోతతో కలకలం సృష్టించిందెవరు? మన బాబే కదూ. అన్నీ ఫ్రీగా ఇస్తే ప్రజలకు విలువ తెలియదంటూ ప్రపంచబ్యాంకు సూత్రాలు వల్లించి మరీ జనాల జేబులు కత్తిరించిన బాబు జాబులిస్తా డా? అయినా ఆ వరల్డ్‌బ్యాంకు పరోక్ష ఆదేశాల అమలుకోసమే కదా అప్పట్లో కొత్త జాబులు సృష్టించకుండా, కాంట్రాక్ట్ ఉద్యోగాలనే కొత్త రకం జాబులనూ, శ్రమదోపిడులనూ సృష్టిం చింది. ఈ తన ‘ట్రేడ్’మార్క్ ట్రాక్ ‘రికారు’్డను బట్టి బాబు జాబులిస్తాడా, జేబులకు చిల్లేస్తాడా? ఒకసారి ఆలోచించు’’
‘‘ట్రాక్‌రికార్డులే కాదు... తాను సృష్టించిన గత రికార్డులను బట్టి చూస్తే నువ్వు చెప్పిందే నిజమని అనిపిస్తుంది’’ ‘‘అందుకే ఫలశ్రుతిగా ఒక్కమాట చెప్పదలచుకున్నా. బాబొస్తే జాబు మాట ఎలా ఉన్నా జేబు తెగటం ఖాయం. జేబుకు గండితో గూబ అదరడం డబుల్ ఖాయం’’
- యాసీన్