►సీఎంను నిలదీసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
► ఓడిపోయిన వారికి ఎస్‌డీఎఫ్ నిధులెలా ఇస్తారు?
► నియోజకవర్గాల్లో సమాంతర పాలన జరుగుతోంది
► కమిటీల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం
►రెండున్నరేళ్లలో చంద్రగిరిలో ఒక్క శంకుస్థాపన,
► ఒక్క ప్రారంభోత్సవమైనా జరిగిందా?
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న తమకు నిధులెందుకు ఇవ్వడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలెన్నుకున్న తమకు కనీస గౌరవం ఇవ్వకుండా, ఓడిపోయి న వారికి ఎస్‌డీఎఫ్ నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ... ఇది నిరంకుశత్వమని నేరుగా విమర్శించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో 34 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు. అనంతరం ఆయనతో జరిగిన సమావేశ వివరాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. తామెన్ని సమస్యలు చెప్పినా ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరించారని తెలిపారు. ఇంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. కనీసం సానుకూలంగా కూడా మాట్లాడకుండా, కక్ష సాధింపు ధోరణిలోనే మాట్లాడారని చెప్పారు.
నిధులివ్వకపోవడం దారుణం: పెద్దిరెడ్డి
నియోజకవర్గాల అభివృద్ధికి రెండున్నరేళ్ల నుంచి నిధులు రాక తమ ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రికి చెప్పామని రామచంద్రారెడ్డి తెలిపారు. ‘‘ఇంతవరకూ ఒక్క వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకుగానీ, జెడ్పీటీసీ సభ్యుడికిగానీ ప్రభుత్వం ఒక్క రూపారుు నిధి కూడా ఇవ్వని విషయాన్ని గుర్తు చేశాం. ఎన్నికై న మమ్మల్ని పక్కనపెట్టి మాపై ఓడిపోరుున వారికి ఎస్‌డీఎఫ్ (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) కింద ప్రత్యేక జీఓలు విడుదల చేసి నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించాం. మా పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం అప్రజాస్వామికమని చెబుతూ... అలా చేరిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన అమర్‌నాథ్‌రెడ్డికి రూ.11 కోట్ల పనులు, 3,200 పెన్షన్లు మంజూరు చేశారని చెప్పాం.
ఇది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం కాదా? ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశాం. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నియోజకవర్గ అభివృద్ధి నిధులను అక్కడి ఎమ్మెల్యేల పేరుతోనే ఇస్తున్నారని తెలిపాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ టీడీపీ ఎమ్మెల్యేలకు నిధులిచ్చామని, కానీ ఇప్పుడు పూర్తిగా తమకు నిధులివ్వకపోవడం దారుణమని చెప్పాం. పలు పథకాలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి మా పార్టీ ఎమ్మెల్యేలు వారి లెటర్ హెడ్‌సపై సంతకాలు చేసి పంపితే నిధులు రావడంలేదని, సంతకం చేయకుండా దరఖాస్తులు పంపితే వెంటనే నిధులిస్తున్న విషయాన్ని చెప్పాం. పెన్షన్లు బాగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పగా... మంజూరైన పెన్షన్లు కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన వారివనే పేరుతో తొలగించడం దారుణమని చెప్పాం.
పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా చెప్పాం. ప్రజలు చెల్లించాల్సిన బిల్లులను వారుుదా వేయాలని, రైతులకు మంజూరు చేసిన రుణాల సొమ్మును వారు ఖర్చు చేసుకునేవిధంగా రూ. 100 నోట్లు ఇప్పించాలని కోరాం. రబీలో కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలిప్పించాలని కోరాం’’ అని ఆయన వివరించారు. ఈ రెండు అంశాలకు సంబంధించి ఒక వినతిపత్రాన్ని ఆయనకు ఇచ్చినట్లు చెప్పారు. తామెన్ని సమస్యలు వివరించినా సీఎం నుంచి స్పందన లేదని, సమావేశం నిరాశాజనకంగా ముగిసిందని తెలిపారు.
సమస్యలు వినే ఓపికలేని సీఎం
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలు వినే ఓపిక కూడా ముఖ్యమంత్రికి లేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పేదలకివ్వా ల్సిన రేషన్ బియ్యం దారిమళ్లుతున్నాయని, స్వయంగా తాను దొంగ బియ్యం లారీని పట్టించిన విషయాన్ని చెప్పినా అలాంటివేం జరగడంలేదని చెప్పడం దారుణమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా చూస్తున్నారని చెప్పారు. తమకిచ్చిన ఎంపీ నిధులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మ్యాచింగ్ గ్రాంట్‌ను కూడా కలెక్టర్లు ఇవ్వకపోవడాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఉప్పులేటి కల్పన చెప్పారు. గతంలో ఎమ్మెల్యేలతో ఆస్పత్రి సలహా సంఘాలు, ఎసైన్‌మెంట్ కమిటీలు వేసేవారని కానీ ఇప్పుడు వాటిలోనూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని చెప్పినట్లు తెలిపారు.
నియోజకవర్గానికి 1250 ఇళ్లు ఇచ్చామని చెబుతున్నా ఓడిపోరుున టీడీపీ నేతలు చెప్పిన వారికే వాటిని ఇస్తున్న విషయాన్ని చెప్పామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబుది, తనది చంద్రగిరి నియోజకవర్గం కాబట్టి ఇద్దరం అక్కడికెళదామని, రెండున్నరేళ్లలో అక్కడ ఒక్క శంకుస్థాపన, ఒక్క ప్రారంభోత్సవమైనా జరిగిందేమో చూపాలన్నా సీఎం స్పందించలేదన్నారు. ఆయన దోమలపై దండయాత్ర అంటున్నారని కానీ ఆయన కార్యాలయం నిండా దోమలు ఉన్నాయని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు.