
కేంద్రం దృష్టికి తొక్కిసలాట ఘటన
న్యూఢిల్లీ: గోదావరి పుష్కరాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం కారణంగానే రాజమండ్రిలో 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళతామని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. సోమవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రేపటినుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ లేవనెత్తనున్న అంశాలను వివరించారు.
గతంలో హామీ ఇచ్చిన మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని సభలో పట్టుపడతామని, రైతుల దీన పరిస్థితులపైనా గళం విప్పుతామన్నారు. వరి, పత్తి పంటలకు ఇటీవల పెంచిన మద్దతు ధర సరిపోదని, దానిని మరింత పెంచాల్సిన అవసం ఉదని, పొగాకు రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని, ఈ విషయాలపైనా సభలో మాట్లాడతామన్నారు.
ప్రతిపక్ష ఎంపీల విషయంలో అధికారులు ప్రోటోకాల్ నియమాలను విస్మరిస్తున్న ఉదంతాలను స్పీకర్ దృష్టికి తీసెకెళ్తామన్నారు. ఎంపీ ల్యాండ్స్, ఆదర్శ గ్రామ్ యోజన పథకాల కింద ప్రస్తుతం ఇస్తోన్న నిధులు సరిపోవడంలేదని ఈ మేరకు నిధులు పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. లలిత్ మోదీ అంశంలో రేపు సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తారని వెంకయ్యనాయుడు చెప్పినట్లు పేర్కొన్నారు.