
ఇరు రాష్ట్రాల సమస్యలను సభలో ప్రస్తావించండి: వైఎస్ జగన్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు సూచించారని ఆ పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాంపై వైఎస్ జగన్ అధ్యక్షతన శనివారం లోటస్పాండ్లో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మేకపాటి రాజమోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాలలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం సంబంధిత మంత్రులు, అధికారులను కలసి చర్చించాలని వైఎస్ జగన్ సూచించారన్నారు.
పెండింగ్ ప్రాజెక్ట్లకు కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా వ్యవహారించాలని వైఎస్ జగన్ తెలిపారని ఆయన అన్నారు. అలాగే హుదూద్ తుపాను సాయం, రైతుల సమస్యలు, ముంపు మండలాలు తదితర అంశాలపై పార్లమెంట్లో తమ గళంవినిపిస్తామని మేకపాటి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీతను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను మరోసారి కోరతామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు.