
'ప్రత్యేక హోదానే మా ప్రధాన అంశం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే తమ అజెండాలో ప్రధాన అంశమని, ఇదే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని, ఇందుకు తాము పట్టబడుతామని ఆయన చెప్పారు. అదేవిధంగా ఇటీవల వర్షాలతో రాష్ట్ర రైతులు నష్టపోయారని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర పెంచాలని కోరుతామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యలన్నింటినీ ప్రధానంగా లేవనెత్తుతామని ఆయన వివరించారు.