6న అనంతలో ప్లీనరీ సమావేశం | ysrcp pleanary 6th on anantapur | Sakshi
Sakshi News home page

6న అనంతలో ప్లీనరీ సమావేశం

Published Fri, Jun 2 2017 10:41 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ysrcp pleanary 6th on anantapur

అనంతపురం న్యూసిటీ : వైఎస్సార్‌ సీపీ అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం ప్లీనరీ సమావేశం ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు మూడవ రోడ్డులోని గొంగటిరామప్ప(జీఆర్‌) ఫంక‌్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్లీనరీ సమావేశ వివరాలను తెలియజేశారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకర్‌నారాయణ, పరిశీలకుడిగా కాపు రామచంద్రారెడ్డి హాజరవుతున్నారన్నారు. టీడీపీ మూడేళ్ల పాలనలో చేసిన అవినీతి అక్రమాలపై జరిపే పోరాటాలపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కొన్ని తీర్మానాలు చేయనున్నామన్నారు. అలాగే కార్యకర్తలు తమ అభిప్రాయాల మనోభావాలను తెలుసుకుంటామన్నారు. నియోజకవర్గ పరిధిలోని జిల్లా నేతలు, వివిధ అనుబంధ సంఘాల నేతలు, 50 డివిజన్ల కన్వీనర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నెల రోజుల డెడ్‌లైన్‌
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే, మేయర్‌ ఘోరంగా విఫలం చెందారన్నారు. ప్రజాశ్రేయస్సుకు పాటుపడకుండా గ్రూపు రాజకీయాలతోనే సరిపెట్టారన్నారు. నగరంలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందన్నారు. పందులు, కుక్కల స్వైర్య విహారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాగునీటిని సరఫరా లేక ప్రజలు నీటిని కొనుగోలు చేసే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. పాలకులకు నెల రోజుల డెడ్‌లైన్‌ విధిస్తున్నామని, అంతలోగా ప్రజా అవసరాలను తీర్చని పక్షంలో వామపక్షాలను కలుపుకుని ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.

పోలీసులు కనరేమీ..
ప్రజా సంక్షేమం కోసం ధర్నా, నిరసనలు చేస్తే వివిధ రకాల సమస్యలను చూపుతూ అడ్డంచెప్పే పోలీసులకు నవనిర్మాణ దీక్షతో ప్రజలు పడే ఇబ్బందులు కనరేమని గురునాథరెడ్డి ప్రశ్నించారు. నగరం నడిబొడ్డున రోడ్డును కొన్ని గంటల పాటు బ్లాక్‌ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు నరకం చూశారన్నారు. ఇప్పటికైనా పోలీసులు వివక్ష మానుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నగరాధ్యక్షులు రంగంపేట గోపాల్‌ రెడ్డి, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాం నాయక్, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర నేత కొర్రపాడు హుస్సేన్‌పీరా, నగరాధ్యక్షులు బలరాం, కార్పొరేటర్‌ గూడూరు మల్లికార్జున, మైనార్టీ నాయకులు నదీమ్, మహిళా విభాగం నగరాధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement