
హోదాతోనే మంచి రోజులు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిం చేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని తెలిపారు. రెండున్నరేళ్లుగా ఈ నినాదాన్ని తమ పార్టీ మోగిస్తోందని, ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ఊపిరి పోస్తోందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి ప్యాకేజీకి ఓకే చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు. ప్యాకేజీతో ఆ పార్టీ నాయకుల జేబులు నిండుతాయే తప్ప పేదల కడుపులు నిండవని తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగానే ఈనెల 26వ తేదీన సాయంత్రం 5.30గంటలకు శ్రీకాకుళంలోని సూర్యమహల్ కూడలి వద్ద నుంచి జీటీ రోడ్ మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ ర్యాలీగా నిర్వహించి అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తామన్నారు.
నిర్వాసితులపై నిర్లక్ష్యమేల?
వంశధార నిర్వాసితులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏ మాత్రం బాగా లేదని ఆమె అన్నారు. హామీలతో కాలం నెట్టుకువస్తున్న నేతలు సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదని సూటిగా విమర్శించారు. ప్రజా పోరాటాన్ని అణగదొక్కాలని చూస్తే కలమట, అచ్చెన్నలకు అక్కడి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వంశధార నిర్వాసితుల విషయంలో ప్రజాప్రతినిధులు చేసిన తప్పులను అధికారులపైకి నెట్టివేయడం చంద్రబాబుకు తగదన్నారు. నిర్వాసితుల అభిమానం దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ నేత మెంటాడ వెంకట స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.