![విశాఖ ర్యాలీలో నేను పాల్గొంటాను: వైఎస్ జగన్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81485327536_625x300.jpg.webp?itok=X-dQ6ZkK)
విశాఖ ర్యాలీలో నేను పాల్గొంటాను: వైఎస్ జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటేందుకు విశాఖపట్నంలో గురువారం సాయంత్రం నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలో యువత పాల్గొనకుండా చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని, తనను అరెస్టు చేస్తారా.. ఏం చేస్తారో మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. శాంతియుతంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తున్నామని, దీనికి ఆటంకాలు కలిగించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రతి జిల్లా కేంద్రంలోనూ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు యువత ముందుకొస్తుండగా.. ర్యాలీ జరపొద్దంటూ చంద్రబాబు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోయినా సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉందని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడం దారుణమని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పిలుపునిచ్చిన బంద్‌ల సమయంలోనూ ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలన చూస్తుంటే.. బ్రిటిష్ పాలనలో ఉన్నట్టుందని విమర్శించారు. యువభేరి సదస్సులకొచ్చే విద్యార్థులపై పీడీ కేసులు పెడుతున్నారని, విద్యార్థులపై కాదు చంద్రబాబుపై టాడా కేసుపెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
జూన్ వరకు వేచిచూస్తాం.. ఆ తర్వాత రాజీనామాలే!
ప్రత్యేక హోదా కోసం ఎవరూ ముందుకొచ్చినా స్వాగతిస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అందరం కలిసి ఢిల్లీ వెళ్దామని, చంద్రబాబు కూడా ముందుకురావాలని కోరారు. అయినా హోదాకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే.. మొత్తం 25 మంది కేంద్రం నుంచి మీ మంత్రులను ఉపసంహరించుకోవాలని, మొత్తం 25 మంది ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని సూచించారు. ఈ ఉద్యమంలో చంద్రబాబు సహకరించినా, సహకరించకపోయినా తాము ముందుకే వెళుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాలకు మూడేళ్ల వరకు సమయమిస్తానని, జూన్ వరకు వేచిచూస్తామని తెలిపారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని ఆయన వెల్లడించారు.
ఎంపీలంతా రాజీనామా చేసి దేశంమొత్తం చూసేలా ఉప ఎన్నికలకు వెళుతారని, రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీని ప్రభుత్వాలు నిలబెట్టుకోలేని విషయాన్ని దేశానికి చాటిచెప్తారని ఆయన చెప్పారు. ఈ ఉద్యమంలో చంద్రబాబు కూడా మాతో కలిసి వస్తే సంతోషిస్తామని, ఆయన కలిసిరాకపోతే ప్రజలు, దేవుడు ఆయనను కచ్చితంగా బంగాళాఖాతంలో కలుపుతారని పేర్కొన్నారు. జల్లికట్టు విషయంలో తమిళనాడు అంతా ఏకమైందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ముందుండి డిమాండ్‌ను సాధించారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం చంద్రబాబు అలాంటి పనిచేయకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.