ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే !
అనంతపురం ఎడ్యుకేషన్ : విభజన అనంతరం పూర్తిగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ అభివద్ధి సాధించాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక మునిసిపల్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి పల్లె రఘునాథరెడ్డిని అడ్డుకున్నారు. అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొనగా బయట బైఠాయించి ఆందోళన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్యాకేజీ కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సిగ్గుచేటన్నారు.
ఎన్నికల ముందు నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు పోటీలు పడి రాష్ట్రానికి 5, 10, 15 ఏళ్లు హోదా ఇస్తేనే అభివద్ధి అని ప్రకటించారన్నారు. ఈరోజు ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి ఎలా స్వాగతిస్తారన్నారు. ప్రత్యేక హోదాకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతిచ్చేదాకా టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శులు లోకేష్‌శెట్టి, సుధీర్‌రెడ్డి, బాబాసలాం, నాయకులు కిరణ్, అనిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.