అంతా అధికారులే చేశారు! | zp general body meeting | Sakshi
Sakshi News home page

అంతా అధికారులే చేశారు!

Published Thu, Jul 13 2017 11:21 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

అంతా అధికారులే చేశారు! - Sakshi

అంతా అధికారులే చేశారు!

పంట నష్టం పరిహారం పంపిణీలో అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు
వ్యవసాయశాఖ సిబ్బందిపై చర్యలకు డిమాండ్‌
పింఛన్‌, తాగు, సాగునీటి కష్టాలకూ అధికారులపై నెపం
అనంత జెడ్పీ సమావేశంలో వాడీవేడి చర్చ


ఇంత కాలం అధికారులపై పెత్తనం చెలాయిస్తూ.. సంక్షేమ పథకాల ఫలాలన్నీ పక్కదారి పట్టించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తాజాగా మాటమార్చారు. పంట నష్టం పరిహారం పంపిణీలోను. పింఛన్‌లు, తాగు, సాగునీటి కష్టాలకు అధికారుల తప్పిదాలే కారణమంటూ నెపం నెట్టేశారు. అన్నింటికీ అధికారులనూ బాధ్యలను చేస్తూ మాటలన్నారు... చిందులు తొక్కారు. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా బిక్కచచ్చిపోయారు. గురువారం జరిగిన జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం.. అధికారులకు ఓ గుణపాఠంగా నిలిచింది.
- అనంతపురం సిటీ

రైతు సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని అధికారులే మంట గలుపుతున్నారంటూ టీడీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్‌ చమన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. అర్హులైన చాలామంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చేరలేదన్నారు. ఇందుకు కారకులైన వ్యవసాయ శాఖ సిబ్బందిపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయశాఖ జేడీ రామ్మూర్తి ఉదాసీన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు.

పింఛన్ల పంపిణీలో చోటు చేసుకున్న అక్రమాలపై కూడా అధికారులనే బలిపశువులను చేశారు. అర్హులకు పింఛన్లు అందకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆరోపించారు.  మూడేళ్ల తర్వాత అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు గుర్తుకు వస్తున్నాయని, ఇంతకాలం అధికారులపై ఒత్తిళ్లు పెంచి అక్రమ మార్గాల్లో పనులు చేయించుకున్నవారే నేడు సమావేశంలో అధికారులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ ఫ్లోర్‌లీడర్‌ వెన్నపూస రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రవీంద్రారెడ్డి ప్రశ్నలతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇరుకునపడ్డారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.కోట్లు కాజేశారని, వారితో పోల్చుకుంటే తామే మేలంటూ ఎమ్మెల్యే పార్థసారథి చెప్పొకొచ్చారు. అదే సమయంలో రవీంద్రారెడ్డి మాట్లాడబోతుండగా మైక్‌ కట్‌ చేయించారు.

ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తినరసింహారెడ్డి,  వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ...మహానేత వైఎస్సార్‌ పుణ్యమా అంటూ జిల్లాకు హంద్రీ-నీవా వరంగా మారిందని అన్నారు. వైఎస్సార్‌ చేసిన పనిని తమ గొప్పగా టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. దీంతో  సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.   ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగుల జేబులు లూటీ చేస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పష్టం చేశారు. అనంతరం వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపులకు ఆగస్టు 31 వరకు గడువు పొడగించాలని, జెడ్పీలోని పాతభవనాన్ని తొలగించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని సభ్యులు తీర్మానించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, సీఈఓ రామచంద్ర, ఉపాధ్యక్షురాలు సుభాషినమ్మ, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం, విద్య,  వైద్యం, పింఛన్‌లు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులపై సుదీర్గ చర్చలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement