
బల్లలు, టీవీలపై పగబట్టినట్టు..
రాజోలు: ‘ఫలానా బస్సు ఫలానా ప్లాట్‌ఫాంపైకి వస్తుంది’ అన్న అనౌన్స్‌మెంట్లు ఆర్టీసీ బస్టాండ్లలో మామూలే. ‘ప్లాట్‌ఫాం పైకి’ అంటే ఆ ప్లాట్‌ఫాంకు సంబంధించి, ‘దిగువన బస్సులు నిలిచే చోటికి ’అనే అర్థం. అయితే రాజోలు బస్టాండ్‌లో ఆదివారం ఓ బస్సు ప్లాట్‌ఫాం పైకే వచ్చేసి, అందరినీ బెంబేలెత్తించింది. ఉదయం 6 గంటల సమయంలో రాజోలు నుంచి అమలాపురం వెళ్లే బస్సును డ్రైవర్ నాలుగో నంబరు ప్లాట్‌ఫాంకు తీసుకువచ్చాడు. బస్సు ఇంజన్ ఆపివేసి, తాళం ఆన్‌చేసి డ్యూటీ చార్టర్ కౌంటర్ వద్దకు వెళ్లాడు.
ఆ సమయంలో ఆ బస్సును మరో బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో తాళం ఆన్‌చేసి ఉన్న బస్సు ఇంజన్ స్టార్టయి, ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపైకి ఎక్కేసింది. గమనించిన కొందరు డ్రైవర్లు బస్సు ఎక్కి ఇంజన్‌ను ఆపి వేశారు. బస్సు పైకి దూసుకొచ్చిన సమయంలో అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేరు. బస్సు ముందు భాగం ధ్వంసం కావడంతోపాటు, ప్రయాణికులు కూర్చునే బల్లలు విరిగిపోయాయి. 12 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన టెలివిజన్ పగిలిపోయింది. ఈ సంఘటనపై ఎంక్వయిరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment