మానవాళి తొలి హక్కుల పత్రం మాగ్నా కార్టా | 800th aniversary of magna carta | Sakshi
Sakshi News home page

మానవాళి తొలి హక్కుల పత్రం మాగ్నా కార్టా

Published Mon, Jun 15 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

మానవాళి తొలి హక్కుల పత్రం మాగ్నా కార్టా

మానవాళి తొలి హక్కుల పత్రం మాగ్నా కార్టా

ఆధునిక ప్రజాస్వామ్యానికి తొలి బీజం వేసిన ఆ మహా చారిత్రక క్షణానికి నేటికి 800 ఏళ్లు. భూమ్మీద దైవాంశ సంభూతులుగా చక్రవర్తు లు పొందిన తిరుగులేని అధికారానికి తొలిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరోపేరు మాగ్నా కార్టా. ఇది వ్యక్తి స్వేచ్ఛ-హక్కుల పత్రం. రాజు చట్టానికి అతీతుడు కాదని, చట్టపాలనకు లోబడాల్సిందేనంటూ రూపొందిన తొలి హక్కుల పత్రంపై ఒక నిరంకుశ చక్రవర్తి తప్పనిసరై సంతకం పెట్టిన క్షణాన్నే.. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ అనే మహత్తర భావాలు పురుడు పోసుకున్నాయి. రాజు సర్వాధికారి అనే వేల ఏళ్ల అభిప్రాయాన్ని  ఆ ఒక్క సంతకం తల్లకిందులు చేసింది.

మాగ్నా కార్టా నుంచి అమెరికా రాజ్యాంగ సభ, ఫ్రెంచ్ విప్లవం, వలస పాలనకు వ్యతిరేకంగా సకల దేశాల్లో కొనసాగిన స్వాతంత్య్ర పో రాటాల వరకు తిరుగులేకుండా ప్రకటించిందీ, నిలబెట్టిందీ ఈ ప్రజా సార్వ భౌమాధికారాన్నే. రాజు అధికారానికి కోత పడి ప్రజాధికారానికి బీజాక్షరాలు పలికిన చరిత్రకు నిలువెత్తు దర్పణం. మాగ్నా కార్టా..  అధి కారం చేతులు మారి ప్రజల పరమవుతున్న పరిణామం నెమ్మదిగా వివి ధ రూపాల్లో చరిత్రలో నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇంత సుదీర్ఘకాలం తర్వాత కూడా ప్రజలకు నిజమైన అధికారం ప్రపంచంలో ఏ దేశంలోనూ వాస్తవార్థంలో సిద్ధించకపోవడమే అసలైన విషాదం. అంతమాత్రాన 1215 జూన్ 15న బ్రిటన్ రాజు జాన్ తన విధేయులకు తలొగ్గి చేసిన ఆ తొలి అధికారమార్పిడి సంతకం విలువ ఏమాత్రం తగ్గ దు. స్వాతంత్య్రం కోసం మనిషి అనంతరీతుల్లో సాగిస్తున్న ప్రతి ప్రయ త్నంలోనూ నేనున్నానంటూ ఆ స్వేచ్ఛాపత్రం గుబాళిస్తూనే ఉంది.

వివిధ నాగరికతల్లో రాజులు ప్రజల కోసం రూపొందించిన చట్టా ల గురించి మనం చదువుకున్నాం. యూదులకు మోసెస్, భారతదేశం లో మనువు, మెసొపొటేమియాలో హమురాబీ, చైనాలో కన్ఫ్యూసియ స్, రోమ్‌లో జస్టీనియన్ వంటి వారు ఈ కోవకు చెందుతారు. వీరంతా ప్రజలకు న్యాయ స్మృతులను రాజు తరఫున అందించినవారు. కానీ ఈ న్యాయం తిరగబడిన చరిత్రకు తొలి సంకేతం మాగ్నా కార్టా. అంత వరకు అలవిమాలిన పన్నులను విధిస్తున్న రాజునుంచి అతడి సామం తులు తమ హక్కులను డిమాండ్ చేసి లాక్కున్న స్వేచ్ఛా పత్రమే మాగ్నా కార్టా. తన ఇచ్ఛే చట్టం కానవసరం లేదని, చట్టం కంటే తాను ఉన్నతుడిని కానని చరిత్రలో ఒక చక్రవర్తి తప్పనిసరి పరిస్థితుల్లో అంగీ కరించి చేసిన అద్వితీయ సంతకం అది. నీవెంత ఉన్నత స్థానంలో ఉన్నా నీకంటే పైనే న్యాయం, శాసనం ఉంటుందని చాటిందది.

చట్టపాలన అనే భావన దాంతోనే చరిత్రలో ప్రారంభమైంది. పాలితుల సమ్మతి లేకుండా పన్నులు విధించనంటూ ఒక రాజు తొలి సారిగా అంగీకరించిన క్షణం అది. న్యాయాన్ని ఎవరూ కొనుక్కోలేరని, నిర్బంధంలోని వ్యక్తి బహిరంగ విచారణ హక్కును కలిగి ఉంటాడని కూడా రాజు ప్రకటించాడు. ఈ కోణంలో చూస్తే భూమ్మీద ఆవిర్భవిం చిన రాజ్యాంగ పత్రాల్లో శిఖరస్థాయి మాగ్నా కార్టాదే. అధర్మానికి, అన్యాయానికి, నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా వ్యక్తి స్వాతంత్య్రానికి  పునాదులు వేసిన తొలి చారిత్రక పత్రం మాగ్నాకార్టా. కానీ 800 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మాగ్నా కార్టా ప్రజలకు అందించిన హక్కులు సారంలో అమలు కాలేదన్నది వేరే విషయం.

రాజుకు దఖలుపడిన పవిత్ర హక్కును తృణీకరించి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి నాందిప లికిన మాగ్నా కార్టా కులీనుల ప్రయోజనాలకే  పట్టం కట్టి ఉండవచ్చు కానీ మానవాళికంతటికీ స్ఫూర్తిదాయకంగా అది తన పాత్రను పోషిస్తూ వెళ్లింది. భారత రాజ్యాంగంతో సహా ప్రజాస్వామ్య దేశాల్లోని పాలనా వ్యవస్థలన్నీ మాగ్నా కార్టాను స్ఫూర్తిగా తీసుకున్నవే. న్యాయం నేటికీ అమ్ముడుపోతూ, హక్కులకు నిత్యం భంగం కలుగుతున్న  నేప థ్యంలో అది ప్రవచించిన స్వేచ్ఛ, హక్కుల నిజమైన సారాంశాన్ని  సాధించుకోవలసిన అవసరం ప్రజలపైనే ఉంది. ఇదే మాగ్నా కార్టా ఎనిమిది శతాబ్దాల చరిత్ర మనకందిస్తున్న సందేశం.

(మాగ్నాకార్టాకు నేటికి 800 ఏళ్లు)
 - కె. రాజశేఖరరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement