ప్రపంచ దేశాలన్నిటా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం తన లక్ష్యమంటూ చెప్పే అమెరికా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ మానవ హక్కుల మండలికి గుడ్‌బై చెప్పింది. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ్త హక్కుల మండలి తరచు తీర్మానాలు చేస్తున్నదని సమితిలో ఆ దేశం రాయబారి నిక్కీ హేలీ ఆరోపిస్తున్నారు. ఇటీవలికాలంలో ఇజ్రాయెల్‌పై మండ లిలో అయిదు తీర్మానాలు ఆమోదించడాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు. అయితే శాంతియుతంగా నిరస నలు తెలుపుతున్న పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు తరచు దాడులు చేస్తున్న సంగతిని నిక్కీ హేలీ విస్మరిస్తున్నారు. అలాగే ఆ నిరసన ప్రదర్శనలకు మూలం తమ మతిమాలిన చర్యేనని కూడా మరుస్తున్నారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు డిసెంబర్‌లో ప్రకటించారు.
దాంతోపాటు టెల్ అవీవ్‌లోని తమ దౌత్య కార్యాల యాన్ని అక్కడికి తరలిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో అది కూడా పూర్తయింది. అప్పటినుంచీ అమె రికా వైఖరిని నిరసిస్తూ పాలస్తీనాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రతిసారీ ఇజ్రాయెల్ దళాలు రెచ్చిపోయి వారిపై కాల్పులు జరుపుతున్నాయి. గాజాలో గత ఏడు నెలలుగా సాగుతున్న ఈ నర మేథంలో పదులకొద్దీమంది నేలకొరిగారు. వందలాదిమంది గాయపడ్డారు. ఈ నెల మొదట్లో జరి గిన కాల్పుల్లో సైతం అయిదుగురు చనిపోగా 117మంది గాయపడ్డారు. తమ ఘనకార్యం పర్య వసానంగానే పాలస్తీనా అల్లకల్లోలంగా మారిందని గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడానికి బదులు ఇజ్రాయెల్ తీరును హక్కుల మండలి ఖండించడాన్ని అమెరికా తప్పుబడుతోంది. వర్తమాన పరి స్థితులపై దాని ఆలోచనలు ఎంత తలకిందులుగా ఉన్నాయో ఈ చర్య తేటతెల్లం చేస్తోంది.
మండలి నుంచి వైదొలగుతూ అమెరికా చేసిన ఆరోపణలు చిత్రంగా ఉన్నాయి. మానవహక్కు లకు పెద్ద పీట వేసే దేశాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూ, హక్కులను ఉల్లంఘించే దేశాలను మండలి కాపాడుతున్నదట! అలాంటి సంస్థలో కొనసాగుతూ దానికి విశ్వసనీయత కల్పించటం తమకు ఇష్టం లేదట!! అకారణంగా హక్కుల మండలి ఖండన తీర్మానాల బారినపడుతున్న ‘మానవ హక్కుల’ దేశాలేవో అమెరికా వివరించి ఉంటే బాగుండేది. అసలు మానవ హక్కుల మండలి పుట్టిన ప్పుడే అమెరికా దానితో పేచీకి దిగింది. 2006లో మండలి ఆవిర్భవించినప్పుడు సమితిలో అప్పటి అమెరికా రాయబారి జాన్ బోల్టన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మండలిని తాము గుర్తించబోమని చెప్పారు. అప్పుడాయన రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ ప్రభుత్వం నియమించిన రాయబారి. ఆయనే ప్రస్తుతం ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉంటూ తాజా నిర్ణయానికి కారకుడ య్యారు.
మానవహక్కుల మండలి ఏర్పాటైతే ఇజ్రాయెల్ దురాగతాలపై అది తీర్మానాలు చేస్తుందని రిపబ్లికన్లకు ముందే తెలుసు. అందుకే బుష్ అందులో సభ్యత్వం తీసుకోవ డానికి నిరాకరించారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన బరాక్ ఒబామా దేశాధ్యక్షుడయ్యాక 2009లో అమెరికా అందులో చేరింది. ట్రంప్ వచ్చినప్పటినుంచి దాన్నుంచి బయటపడటానికి మార్గాలు వెదుక్కుంటున్నారు. నిజానికి ఇజ్రాయెల్‌పై మండలి ‘అన్యాయంగా’ తీర్మానాలు చేస్తున్నదన్న అభిప్రాయం అమెరికా మిత్రదేశా లైన బ్రిటన్, ఆస్ట్రేలియాలకు కూడా ఉంది. కానీ సంస్థలో ఉంటూ ఆ తీరును వ్యతిరేకించాలని వారు చెబుతున్నారు. అయితే అమెరికా ఆలోచన వేరు. ప్రస్తుతం పాలస్తీనాలో వెల్లువెత్తుతున్న నిరసనలు రాయబార కార్యాలయం తరలింపునకు వ్యతిరేకంగా జరుగుతున్నవి. వాటిని అణచేందుకు చర్యలు తీసుకుంటున్న ఇజ్రాయెల్‌ను అభిశంసించడమంటే, తన చర్యను కూడా మండలి ఖండించినట్టే అవుతుందని దానికి తెలుసు. కనుకనే అది బయటి కొచ్చింది.
మానవ హక్కుల మండలిలో సభ్యత్వమున్నంత మాత్రాన అందులోని దేశాలన్నీ ఆ హక్కుల్ని గౌరవిస్తున్నాయని కాదు. చైనా, సౌదీ అరేబియా, ఈజిప్టు, పాకిస్తాన్ వగైరా దేశాలపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలొచ్చాయి. కశ్మీర్‌లో మన దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్ప డుతున్నదని ఈమధ్యే మండలి నివేదిక ఆరోపించింది. ఆ సంస్థ ఏటా మూడుసార్లు సమావేశమై సమితి సభ్య దేశాల్లో మానవ హక్కుల స్థితిగతుల్ని సమీక్షిస్తుంది. ఆయా దేశాల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. అవసరమనుకుంటే ఆరోపణలెదుర్కుంటున్న దేశాలకు నిపుణుల్ని పంపి నివేది కలు తెప్పించుకుంటుంది. తప్పనిసరి అనుకున్నప్పుడు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తుంది. మానవ హక్కుల మండలి అభిప్రాయాలతో ఏ దేశమైనా విభేదించడంలో తప్పులేదు. కానీ అలా విభేదించడానికి హేతుబద్ధమైన కారణాలను చూపాలి. మానవ హక్కుల మండలి వంటి సంస్థల వల్ల పౌరులను వేధిస్తున్న, అణచివేస్తున్న ప్రభుత్వాలపై ప్రపంచ ప్రజల దృష్టి పడుతుంది. వాటిపై ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆ ప్రభుత్వాలు దారికొచ్చే అవకాశముంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్న భయం అమెరికాకు ఏమూలనో ఉంది.
నిజానికి ఇజ్రాయెల్ మాత్రమే కాదు... అమెరికా సైతం హక్కుల మండలి అభిశంసనకు అర్హమై నదే. ట్రంప్ వచ్చాక స్వదేశంలో మీడియా స్వేచ్ఛపై తరచు దాడి చేస్తున్నారు. పురుషులతో సమా నంగా మహిళలకు సమాన వేతనాలివ్వడం తప్పనిసరి చేస్తూ ఒబామా హయాంలో తీసుకొచ్చిన రక్షణలకు మంగళంపాడారు. యెమెన్‌లోని అమెరికా రహస్య జైళ్లలో నిర్బంధితుల చిత్రహింసలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిహద్దులు దాటి చట్టవిరుద్ధంగా అమెరికాకు వస్తున్నవారిని అరి కట్టడం కోసం వారిలోని పెద్దలనూ, పిల్లలనూ వేర్వేరు శిబిరాలకు తరలించి నిర్బంధిస్తూ భయ భ్రాంతులకు గురిచేశారు. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీటన్నిటి విషయంలో సంజాయిషీ ఇవ్వాల్సిందిపోయి ఇజ్రాయెల్‌కు ఏదో అన్యాయం జరుగుతు న్నదని ఆక్రోశించడం అమెరికాకు తగని పని.
Comments
Please login to add a commentAdd a comment