![North Korea warns to America - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/25/south-koria.jpg.webp?itok=mdtqO4XP)
సియోల్ : తాము అణ్వాయుధాలను విడనాడాలని అమెరికా కోరుకుంటోందని, అయితే అటువంటిదేమీ జరగబోదని ఉత్తరకొరియా తాజాగా అమెరికాను హెచ్చరించింది. తమ దేశంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించడమనేది యుద్ధంతో సమానమైన చర్య అని, ఇలా చేయడం తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. నిరంతరం అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తరకొరియాను నిలువరించేందుకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) మరికొన్ని నూతన ఆంక్షలు విధించడం తెలిసిందే.
ఉత్తరకొరియాకు చమురు సరఫరా నిలిపివేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా రూపొందించిన తీర్మానాన్ని శుక్రవారం సమావేశమైన భద్రతామండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానానికి ఉత్తరకొరియా మిత్రదేశం చైనా కూడా మద్దతునివ్వడం విశేషం. విదేశాల్లో పనిచేస్తున్న ఉత్తరకొరియా పౌరులను వారి దేశానికి పంపించేయాలని కూడా తీర్మానించారు. ఐరాస తీర్మానం వల్ల ఉత్తరకొరియాకు 75 శాతం శుద్ధి చేసిన చమురు సరఫరా నిలిచిపోనుంది.
అమెరికా ప్రధాన భూభాగాన్ని ఢీకొట్టడమే లక్ష్యంగా రూపొందించిన ఖండాంతర క్షిపణిని ప్యాంగ్‌యాంగ్ ఇటీవల పరీక్షించిన నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ‘ఐరాస భద్రతామండలిలో అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి ఆమోదించిన తీర్మానం మా గణతంత్రసార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే. కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతలకు ఇది విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’ అని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్యాంగ్‌యాంగ్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ తీర్మానం పూర్తిస్థాయి ఆర్థిక దిగ్బంధనమేనంది. ‘అమెరికా తాను సురక్షితంగా ఉండాలని కోరుకుంటే మా విషయంలో ప్రతికూల ధోరణిని విడనాడాలి. సహజీవనం చేయడం నేర్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment