మరో కుంభకోణం! | Another fraud : Nirav Modi frauds PNB | Sakshi
Sakshi News home page

మరో కుంభకోణం!

Published Fri, Feb 16 2018 2:06 AM | Last Updated on Fri, Feb 16 2018 11:10 AM

Another fraud : Nirav Modi frauds PNB - Sakshi

నీరవ్‌ మోదీ (ఫైల్‌ ఫోటో)

లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా లాంటివాళ్లు వేల కోట్లు ఎగేసి దేశం విడిచి పారి పోయాక అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనుకుంటూ భ్రమల్లో కూరుకుపో యిన బ్యాంకింగ్‌ రంగానికి మరో వ్యాపారి నీరవ్‌ మోదీ ఝలక్‌ ఇచ్చాడు. స్టేట్‌ బ్యాంకు తర్వాత రెండో అతి పెద్ద బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)కి జంకూగొంకూ లేకుండా రూ. 11,300 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి అచ్చం లలిత్, మాల్యాల తరహాలోనే సకుటుంబ సమేతంగా దేశం నుంచి నిష్క్రమిం చాడు. రూ. 280 కోట్ల మేర మోసం జరిగిందన్న ఫిర్యాదు కాస్తా పట్టుమని పదిరో జులు గడవకుండానే రూ. 11,300 కోట్లకు ఎగబాకింది.

ఇది ఇక్కడితో ఆగు తుందో, మరింతగా పెరుగుతుందో చూడాల్సి ఉంది. చెమటోడ్చి సంపాదిస్తున్న డబ్బుల్లో కొంత మొత్తాన్ని మున్ముందు పనికొస్తుందన్న ఆశతో మధ్య, దిగువతర గతి జనం దాచుకుంటున్నారు. అలాంటివారినుంచి ఏదో ఒక పేరుతో బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కానీ ఇలాంటి మోసగాళ్లకు మాత్రం సునా యాసంగా దోచిపెడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఒక్క పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మాత్రమే కాదు...యూనియన్‌ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు సహా విదేశీ, స్వదేశీ బ్యాంకులు 30 వరకూ మునిగిపోయినట్టు చెబుతున్నారు. 

చూడటానికి ఒకరిద్దరు ఉద్యోగులు ఓ పద్ధతి ప్రకారం, ఎవరూ గుర్తించలేని విధంగా చేసినట్టు కనబడుతున్నా పీఎన్‌బీకి సారథ్యం వహిస్తున్నవారు... దాన్నుంచి జారీ అయినట్టు చెబుతున్న లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌(ఎల్‌వోయూ)ల విశ్వనీయత ఎంతో తేల్చుకోకుండా రుణాలిచ్చిన ఇతర బ్యాంకులు... వీటి కార్య కలాపాలను పర్యవేక్షించాల్సిన రిజర్వ్‌బ్యాంకు తమ బాధ్యతనుంచి తప్పించు కోలేవు. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (సీఈఐబీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలి జెన్స్‌(డీఆర్‌ఐ) వంటి వివిధ పర్యవేక్షణా సంస్థల సమర్థత సైతం ప్రశ్నార్థకమవు తోంది. నిజానికి నీరవ్‌ మోదీ మోసం ఇప్పటికిప్పుడు మొదలైందేమీ కాదు. 2010 నుంచి ఏడేళ్లుగా ఇదంతా సాగుతోంది. పైగా నీరవ్‌ మోదీపై ప్రధాని కార్యాలయం (పీఎంఓ)కు 2015లోనే ఫిర్యాదు చేసినా దిక్కూ మోక్కూ లేకపోయిందని మొద టిగా దీన్ని బయటపెట్టిన వ్యక్తి చెబుతున్నాడు. అదే నిజమైతే పబ్లిక్‌ రంగ సంస్థల డబ్బు ఎలా పోతున్నా, ఎటు పోతున్నా ఎవరికీ పట్టడం లేదని బోధపడుతుంది.

నీరవ్‌ మోదీ ఈ దేశంలో మొదటి మోసగాడు కాదు. చెప్పాలంటే లలిత్‌మోదీ కన్నా, విజయ్‌మాల్యాకన్నా చాలా ముందే బ్యాంకుల్ని వివిధ మార్గాల్లో ముంచిన మోసగాళ్లున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇలా ఎంతమంది, ఎన్నిసార్లు మోసగిస్తున్నా బ్యాంకింగ్‌ వ్యవస్థకు జవాబుదారీతనం అలవాటు చేయా లని ప్రభుత్వాలు అనుకోలేదు. గతంలో యూపీఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వమైనా మోసాలు బయటపడినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం తప్ప దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని, బ్యాంకులు సైతం తమ వ్యవస్థలను చక్కదిద్దుకోవడానికి సిద్ధపడలేదని అర్ధమవుతుంది. డబ్బుతో వ్యాపారం చేసే సంస్థలకు ఆ డబ్బు ఎన్ని రూపాల్లో లోపలకు వస్తుందో, మరెన్ని రూపాల్లో బయటికి పోతుందో తెలుస్తుంది. అటువంటప్పుడు  బయటికి పోయే మార్గాల్లో ఏఏ దశల్లో మోసం జరగడానికి ఆస్కారం ఉన్నదో, వాటి నివారణకు ఎలాంటి తనిఖీలు అవసరమో, ఆ తనిఖీలు నిర్వహించేవారిపై పర్యవేక్షణ ఏవిధంగా ఉండాలో నిర్ధారించుకోవడం కష్టం కాదు. ఇప్పుడు నీరవ్‌ చేసిన మోసం లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌(ఎల్‌ఓయూ)లకు సంబంధించింది. ఒక బ్యాంకు ఎల్‌ఓయూ జారీ చేసిందంటే అర్ధం ఆ పత్రాన్ని సమర్పించిన వ్యక్తి తీర్చాల్సిన సొమ్ముకు పూచీ పడతామని అర్ధం.

ఈ ఎల్‌ఓయూలు అంతర్జాతీయ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో వినియోగిస్తారు. తగిన మొత్తంలో ఆస్తుల్ని బ్యాంకుకు హామీగా చూపితే తప్ప ఇలాంటి ఎల్‌ఓయూలు జారీ కావు. ఈ లావాదేవీల్లో ఎల్‌ఓయూ జారీ చేసిన బ్యాంకు, దాన్ని స్వీకరిస్తున్న బ్యాంకు, సరుకు దిగుమతి చేసుకుంటున్న సంస్థ, దానిద్వారా లబ్ధిపొందుతున్న సంస్థ ఉంటాయి. ఇలా ఏడేళ్లపాటు నాలుగు చోట్ల జరిగే లావాదేవీల్లో ఏ ఒక్కచోటా మోసం బయటపడకపోవడం ఆశ్చర్యం కలి గిస్తుంది. సాధారణ పౌరులు ఖాతా ప్రారంభించాలన్నా అనేక రకాలైన తనిఖీలుంటాయి. ఆధార్‌ కార్డుతోసహా సవాలక్ష పత్రాలను అడుగుతారు.

కానీ పీఎన్‌బీ నుంచి దొంగచాటుగా జారీ అయిన ఎల్‌ఓయూలను నీరవ్‌ అండ్‌ కో పలు స్వదేశీ, విదేశీ బ్యాంకుల్లో దాఖలు చేసి భారీ మొత్తంలో దోచుకున్నారు. పైగా తమపై ఫిర్యాదు వెళ్తుందని, తమ మోసం బట్టబయలవుతుందని ముందే ఉప్పంది నీరవ్‌ మోదీ, ఆయన భార్య, నీరవ్‌ సోదరుడు, వారి వ్యాపార భాగస్వామి పరా రయ్యారు. ఇందులో నీరవ్‌ ఒక్కడే ఈ దేశ పౌరుడు. ఆయన భార్య అమీకి అమెరికా పౌరసత్వం, సోదరుడు నిషాల్‌కు బెల్జియం పౌరసత్వం ఉన్నాయి. ఈ నలుగురినీ ఇక్కడికి రప్పించడం అంత సులభం కాదని లలిత్, మాల్యా కేసుల్ని గమనిస్తేనే బోధపడుతుంది.

బ్యాంకులు ఇలా మోసపోయి కష్టాల్లో ఉన్నాయని గమనించి వచ్చే రెండేళ్లలో వాటికి రూ. 2.11 లక్షల కోట్లు సమకూర్చడానికి నిరుడు అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద్రవ్యలోటు పరిమితుల్ని దాటకుండానే ఈపని చేస్తా మని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అప్పట్లో చెప్పారు. మొన్న డిసెంబర్‌లో కేంద్రం రూ. 7,577 కోట్లు విడుదల చేసింది కూడా. మరో లక్ష కోట్ల రూపాయల్ని మార్చినాటికి సమకూరుస్తామని గత నెలలో జైట్లీ ప్రకటించారు. బ్యాంకులు మోసగాళ్లకు ఇచ్చి నష్టపోతున్న డబ్బయినా, ఆ లోటు భర్తీకి కేంద్రం తిరిగి ఆ బ్యాంకులకు ఇస్తున్నదైనా ప్రజాధనమే. అడ్డూ ఆపూ లేకుండా ఎన్నాళ్లిలా జనం సొమ్ము హారతి కర్పూరం చేస్తారో ప్రభుత్వమూ, బ్యాంకులూ చెప్పాలి. పాత్ర ధారులు బయటపడ్డారు సరే... వెనకున్న సూత్రధారుల కూపీ లాగాలి. అన్ని విష యాలనూ ప్రజలముందుంచాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement