ఢిల్లీలో నీరవ్ మోదీకి చెందిన వజ్రాభరణాల షోరూమ్
ముంబై: యావద్దేశాన్ని నివ్వెరపరుస్తూ వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల్ని రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో దర్యాప్తును సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ)లు ముమ్మరం చేశాయి. భారతదేశ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు కుంభకోణంగా పేర్కొంటున్న ఈ కేసులో గురువారం ఈడీ భారీ మొత్తంలో ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారుడైన బిలియనీర్, ఆభరణాల డిజైనర్ నీరవ్ మోదీకి చెందిన దుకాణాలు, ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీజ్ చేసింది.
బ్యాంకులకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు ఉడాయించిన విజయ్ మాల్యా తరహాలోనే.. ఈ కేసులో నిందితులుగా ఉన్న మోదీ, సోదరుడు నిశాల్, భార్య అమీ, వ్యాపార భాగస్వామి మోహుల్ చోక్సీలు కూడా కుంభకోణం బయటపడక ముందే విదేశాలకు ఉడాయించారు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) సీబీఐకి ఫిర్యాదు చేయగా.. జనవరి మొదటి వారంలోనే నిందితులంతా దేశం నుంచి జారుకున్నారు. నీరవ్ ఇతరులు కలిసి తమ అధికారులతో కుమ్మక్కై ముంబై బ్రాంచీలో రూ. 280 కోట్ల మేర మోసగించారని జనవరి 29న సీబీఐని పీఎన్‌బీ ఆశ్రయించింది. అయితే ఈ కుంభకోణం విలువ మొత్తంగా రూ. 11,400 కోట్ల పైనే ఉంటుందని ఫిబ్రవరి 13న మరో ఫిర్యాదు చేసింది.
ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్‌లో తనిఖీలు
సీబీఐ ఎఫ్‌ఐఆర్, పీఎన్‌బీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ 17 ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. కుర్లాలోని నీరవ్ మోదీ నివాసం, కాలాఘోడాలోని నగల దుకాణం, బాంద్రా, లోయర్ పరేల్‌లోని కంపెనీ కార్యాలయాలు, సూరత్‌లో మూడు చోట్ల, ఢిల్లీలోని చాణక్యపురి, డిఫెన్స్ కాలనీ షోరూంలతో పాటు హైదరాబాద్, జైపూర్‌లో కూడా తనిఖీలు కొనసాగాయి. ముంబైలో నీరవ్, ఇతర నిందితులకు చెందిన ఆస్తుల్ని జప్తు చేశామని, అతని పాస్‌పోర్టును రద్దు చేయాలని విదేశాంగ శాఖను కోరతామని ఈడీ అధికారులు తెలిపారు. మోదీ పాస్‌పోర్టును రద్దుచేయాలని సీబీఐ కూడా ఇప్పటికే కోరింది. తనిఖీల్లో రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలు, బంగారం సీజ్ చేశామని, రూ. 11,400 కోట్ల అక్రమాలపై విచారణ పరిధి ఉంటుందని ఈడీ తెలిపింది.
150 ఎల్‌వోయూ అందజేసిన బ్యాంకు
రూ.11,400 కోట్ల మేర అక్రమ లావాదేవీలు నెరిపేందుకు నీరవ్ మోదీతోపాటు అతని కుటుంబసభ్యులు వాడుకున్న 150 ఎల్‌వోయూ(లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్)లను గురువారం సీబీఐకి అందజేసినట్లు పీఎన్‌బీ తెలిపింది. నీరవ్ మోదీతోపాటు ఈ కేసులో ఉన్న మిగతా వారితో కుమ్మక్కైన తమ అధికారులు అక్రమంగా జారీ చేసిన 150 ఎల్‌వోయూలను ఇప్పటి వరకు కనుగొన్నామని పేర్కొంది. ఈ ఎల్‌వోయూలను హాంకాంగ్‌లో పనిచేస్తున్న అలహాబాద్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు శాఖలకు జారీ చేసినట్లు సీబీఐకి తెలిపింది.
2017లో పీఎన్‌బీని రూ. 280.70 కోట్ల మేర మోసగించారన్న ఆరోపణలపై భారతీయ కుబేరుల్లో ఒకరిగా ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన మోదీ, అతని సోదరుడు నిశాల్, భార్య అమి, వ్యాపార భాగస్వామి మోహుల్ చినుభాయ్ చోక్సీ, డైమండ్ ఆర్ అజ్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్‌కి చెందిన అందరు భాగస్వాములతో పాటు ఇద్దరు బ్యాంకు అధికారులు గోకుల్‌నాథ్ శెట్టీ(రిటైర్డ్), మనోజ్ ఖారత్‌ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది.
ముంబై బ్రాంచ్‌కు చెందిన పీఎన్‌బీ సిబ్బంది నీరజ్ అండ్ కోకు తప్పుడు ‘లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్(ఎల్‌ఓయూ)’ల జారీచేయగా, ఈ ఎల్‌ఓయూతో విదేశాల్లో భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందారనేది ప్రధాన ఆరోపణ. థర్డ్ పార్టీకి తమ ఖాతాదారుడు చెల్లించాల్సిన మొత్తానికి హామీనిస్తూ బ్యాంకులు ఈ ఎల్‌ఓయూలు జారీచేస్తుంటాయి. వీటిని హామీగా పెట్టుకుని విదేశాల్లోని బ్యాంకు శాఖలు రుణాలిస్తాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు తదితర 30 బ్యాంకుల నుంచి వీరు రూ. 11,400 వేల కోట్లకు పైగా రుణాలు పొందినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
ఎవరినీ వదిలిపెట్టం: ఆర్థిక శాఖ
పీఎన్‌బీని మోసగించిన కేసులో నిందితుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, ఎవరినీ వదిలి పెట్టమని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘ఇది ఒక్క బ్రాంచ్‌కు సంబంధించిన అంశం, ఈ కేసు ప్రభావం ఇతర బ్యాంకులకు వ్యాపించే అవకాశం లేదు’ అని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. పీఎన్‌బీ వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని అందువల్ల ఎలాంటి సమస్య ఉండదన్నారు.
‘చోటా మోదీ’ అనడంపై బీజేపీ అభ్యంతరం
ఈ కేసులో ఎంతటి వారినైనా దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానిపై చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. నీరవ్ మోదీని కాంగ్రెస్ పార్టీ ‘చోటా మోదీ’ అని ప్రస్తావించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఈ కుంభకోణం 2011లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభమైంది. నీరవ్ వ్యాపార భాగస్వామి చోక్సీకి ఎవరి ఆశీర్వాదాలు ఉన్నాయి? 2011–13 మధ్యలో చోక్సీ సంస్థ గీతాంజలి జెమ్స్ ఆదాయం రెండింతలైంది’ అని పేర్కొన్నారు. కుంభకోణం తమ ప్రభుత్వ హయాంలో బట్టబయలైందని, చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దావోస్‌కు ప్రధాని మోదీతో పాటు వెళ్లిన ప్రతినిధుల బృందంలో నీరవ్ లేడని, ఆయన సొంతంగానే దావోస్ వెళ్లారని ప్రసాద్ వెల్లడించారు.
నీరవ్ దేశాన్ని దోచుకున్న మార్గాలివే: రాహుల్
ఈ భారీ కుంభకోణం గురించి చెప్పడమే తప్ప.. అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్‌లో స్పందిస్తూ.. ‘దేశాన్ని నీరవ్ మోదీ దోచుకున్న మార్గాలివి.. 1. ప్రధాని మోదీని కౌగిలించుకోవడం 2. దావోస్‌లో మోదీతో కలిసి కనిపించడం తన పలుకుబడితో.. ఏ. రూ. 12, వేల కోట్ల దోపిడీ.. బీ. మాల్యా కేసులో లాగానే ప్రభుత్వం మరోవైపు చూస్తుండగా దేశం నుంచి జారుకున్నారు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని మోదీతో పాటు దావోస్ వెళ్లిన వ్యాపార ప్రతినిధి బృందంలో నీరవ్ మోదీ ఉన్న ఫొటోను కాంగ్రెస్ విడుదల చేసింది. దేశం విడిచిపోయేలా నీరవ్ మోదీని ముందుగానే అప్రమత్తం చేశారా? అని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా ప్రశ్నించారు.
వదిలేది లేదు: పీఎన్‌బీ సీఎండీ
నీరవ్ మోదీ కుంభకోణం కేసులో తప్పుచేసిన వారు ఎంతటి సీనియర్లయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పీఎన్‌బీ సీఎండీ సునీల్ మెహతా స్పష్టం చేశారు. ఇది కేవలం ముంబైలోని ఒక్క శాఖకు మాత్రమే పరిమితమైన ఉదంతమని, మిగతావాటికి విస్తరించినది కాదని ఆయన తెలిపారు. స్కామ్‌కి సంబంధించిన నిధులను నీరవ్ మోదీ చెల్లిస్తానంటున్నా.. ఇప్పటిదాకా స్పష్టమైన ఆఫర్ ఏదీ చేయలేదని మెహతా తెలిపారు. నీరవ్ నిర్మాణాత్మకమైన ప్రణాళికేదీ ప్రకటించలేదని, ఏవేవో అస్పష్టమైన ఆఫర్లు చేస్తున్నారని ఆయన చెప్పారు.
మింగేశారు.. మాయమయ్యారు
లలిత్ మోదీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్‌గా పేరుప్రఖ్యాతులు గడించిన లలిత్ మోదీ, 2011లో నిబంధనలకు విరుద్ధంగా కొచ్చి టస్కర్స్ జట్టు యాజమాన్యం వివరాలను బయటపెట్టాడు. దీంతో బీసీసీఐ మోదీకి షోకాజ్ నోటీసులు జారీచేయడంతో పాటు ఐపీఎల్ బాధ్యతల నుంచి తప్పించింది. కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరింపులు రావడంతో చివరికి అదే ఏడాది మోదీ లండన్‌కు పారిపోయాడు.
విజయ్ మాల్యా: లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు చెక్కేశాడు. మాల్యాను దేశం దాటివెళ్లకుండా అడ్డుకోవాలని బ్యాంకులు 2016, మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించకముందే ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు.
దీపక్ తల్వార్: పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా మారిన దేశాల్లో వందల కోట్లు అందుకున్నారని ఆరోపిస్తూ కార్పొరేట్ కన్సల్టెంట్ దీపక్ తల్వార్‌పై ఐటీ శాఖ ఐదు కేసులు నమోదుచేసింది. యూపీఏ ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల సాయంతో దీపక్ కొన్ని విమానయాన సంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూర్చాడని ఐటీశాఖ పేర్కొంది. కేసులు నమోదుకాకముందే దీపక్ యూఏఈకి పారిపోయాడు.
జనవరిలోనే అందరూ పరార్
ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ ఈ ఏడాది జనవరి 1నే విదేశాలకు పారిపోయినట్లు సీబీఐ గుర్తించింది. మరోవైపు జనవరి 23న దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో భారతీయ సీఈవోలతో ప్రధాని మోదీ దిగిన గ్రూప్ ఫొటోలో నీరవ్ కనిపించారు. ఈ నేపథ్యంలో అతను స్విట్జర్లాండ్‌లోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక బెల్జియం పౌరుడైన నీరవ్ సోదరుడు నిశాల్ జనవరి 1న దేశం విడిచి పారిపోగా.. అమెరికా పౌరురాలైన మోదీ భార్య అమి, వ్యాపార భాగస్వామి, గీతాంజలి జ్యూయెలరీ ప్రమోటర్ మోహుల్ చోక్సీలు జనవరి 6న విదేశాలకు చెక్కేశారు. సీబీఐ కేసు అనంతరం జనవరి 29న వీరిపై లుకౌట్ నోటీసులు జారీచేశారు.
ఇటీవల దావోస్ సదస్సులో గ్రూపు ఫొటోలో ప్రధాని మోదీతో నీరవ్(వృత్తంలో).
ఈడీ సోదాల్లో స్వాధీనం చేసుకున్న వజ్రాలు, ఆభరణాలు
Comments
Please login to add a commentAdd a comment