సంపాదకీయం: జమ్మూ-కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని, ఆ సుందర ప్రదేశం చుట్టూ అలుముకున్న ఉద్రిక్తతలు సమసిపోవాలని ఆశించే వారందరికీ పత్రిబల్ ఎన్‌కౌంటర్ ఉదంతంలో సైన్యం తీసుకున్న నిర్ణయం నిరాశ కలిగిస్తుంది. పత్రిబల్ ఎన్‌కౌంటర్ మనం నిత్యం వినే ఎన్‌కౌంటర్ కథనాలకు భిన్నమైనదేమీ కాదు. 2000 సంవత్సరంలో అనంతనాగ్ జిల్లాలో అయిదుగురు పౌరులను సైన్యం కాల్చిచంపింది. వీరంతా సరిహద్దులకు ఆవలినుంచి చొరబడి వచ్చిన లష్కరే తొయిబా ఉగ్రవాదులని ప్రకటించింది. అంతకు కొన్ని రోజుల క్రితం కాశ్మీర్‌లోని చిట్టిసింగ్‌పురా అనేచోట కూలీలుగా పనిచేస్తున్న 36 మంది సిక్కులను హతమార్చిన ఉగ్రవాదులు ఈ అయిదుగురేనని తెలిపింది.
ఆ నరమేథం కారకులు దాగిన ప్రదేశాన్ని గుర్తించి, వారిని ప్రాణాలకు తెగించి ఎంత చాకచక్యంగా మట్టుబెట్టిందీ ఆనాటి కేంద్ర హోంమంత్రి ఎల్‌కే అద్వానీకి సైనిక, పోలీసు అధికారులు వివరించారు. మరికాసేపట్లోనే ఎన్‌కౌంటర్ గురించిన అనుమానాలు గుప్పుమన్నాయి. మృతులు పాకిస్థాన్‌నుంచి వచ్చినవారు కాదని, ఉగ్రవాదంతో సంబంధంలేని సాధారణ పౌరులని ఆ మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు వెల్లడించారు. అమాయకు లపై ఉగ్రవాద ముద్రేసి హతమార్చడాన్ని నిరసిస్తూ నిరసన ప్రదర్శన జరిగితే, దానిపై పోలీసులు కాల్పులు జరిపారు. అందులో మళ్లీ తొమ్మిదిమంది మరణించారు.
ఎన్‌కౌంటర్ ఉదంతంలో తమకు న్యాయం జరగాలని, ప్రాణాలు తీసిన సైనిక జవాన్లపై చర్య తీసుకోవాలని ఆనాటి నుంచి మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈలోగా ఇది ఎన్నో మలుపులు తిరిగింది. ఖననం చేసిన మృతదేహాలను వెలికితీసి డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపిన నమూనాలు తారుమారయ్యాయి. పోలీసు అధికారుల సస్పెన్షన్లు, న్యాయవిచారణలు, మానవ హక్కుల సంఘం జోక్యం వంటివన్నీ అయ్యాయి. చివరకు సీబీఐ దర్యాప్తు కూడా సాగింది. అన్ని అవాంతరాలనూ అధిగమిం చాక డీఎన్‌ఏ పరీక్షల్లో ఎన్‌కౌంటర్ మృతులంతా కాశ్మీర్‌వాసులేనని తేలింది. సీబీఐ దర్యాప్తు నివేదిక సైతం సైన్యాన్ని తప్పుబట్టింది. ఒక బ్రిగేడియర్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్‌లు, ఒక సుబేదారు ఈ నేరంలో భాగస్వాములని నిర్ధారించింది. కింది కోర్టులో సీబీఐ చార్జిషీటు దాఖలుచేసినప్పుడు సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టం ప్రకారం తమను విచారించడానికి ముందస్తు అనుమతులు తీసుకోవా లని చార్జిషీటులోని సైనికాధికారులు అభ్యంతరం లేవనెత్తారు.
కింది కోర్టు, హైకోర్టు ఆ వాదనను తోసిపుచ్చాక విషయం సుప్రీంకోర్టు ముందుకెళ్లింది. సీబీఐ నిందితులుగా నిర్ధారించినవారందరి ప్రాసిక్యూ షన్‌కు అనుమతినివ్వడం లేదా సైనిక న్యాయస్థానంలో తామే విచారించడం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఇది చెప్పి కూడా రెండేళ్లు దాటుతోంది. మొత్తం పద్నాలుగేళ్ల కాలహరణం తర్వాత నిందితులంతా నిర్దోషులని సైనిక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారంతా పాక్ పౌరులేనని, వారికి సంబంధించి అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే సైన్యం దాడిచేసి అయిదుగురినీ మట్టుబెట్టిందని ఆ తీర్పు పేర్కొంది. డీఎన్‌ఏ పరీక్షలు సైతం నిర్ధారణగా తేల్చిచెప్పిన విషయాలు కళ్లముందుండగా, వారి బంధువుల సాక్ష్యాధారాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు మార్షల్ ఎలా నిర్ధారించగలిగింది? అందుకు అది చూపిన కారణాలేమిటి? ఏ విషయంపైనా స్పష్టత లేదు.
పారదర్శకత అసలే లేని కోర్టు మార్షల్ తీర్పుద్వారా సైన్యం పంపదలుచుకున్న సందేశం ఏమిటి? నాలుగేళ్ల క్రితం మఛిల్ ప్రాంతంలో జరిగిన ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌పై కోర్టు మార్షల్ చేయబోతున్నట్టు నెలక్రితం సైన్యం ప్రకటిస్తే హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తాజా ఉదంతాన్ని చూస్తే అలాంటి ఆశలన్నీ ఆవిరవుతాయి. అసలు సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టం గురించే ఎన్నో విమర్శలున్నాయి. కేంద్రం నియమించిన జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి కమిటీ కూడా ఆ చట్టం అమానవీయమైనదని, దాన్ని రద్దు చేయాలని తేల్చిచెప్పింది. కాశ్మీర్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులరీత్యా ఆ చట్టం అవసరమున్నదనుకున్నప్పుడు ఆ ‘ప్రత్యేక పరిస్థితుల’ను ఎదుర్కోవ డానికి మాత్రమే ఆ చట్టం ఉపయోగపడాలి. కానీ, ఈ ఉదంతంలో ‘ప్రత్యేక పరిస్థితి’ ఏం ఉంది? ఉగ్రవాద ఘటనతో సంబంధంలేని సాధారణ పౌరులను అకారణంగా మట్టుబెట్టడమే ఇందులోని విషయం. ఇలా ఎవరినైనా చంపవచ్చునన్నది వారికప్పగించిన విధుల్లో భాగం కాదు. ఆ చర్య కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేది కాదు సరిగదా... దాన్ని మరింత విషమింపజేసేది. అలాంటపుడు సుప్రీంకోర్టు ముందుకు ఈ విషయం వచ్చినప్పుడే కేంద్రం దృఢంగా వ్యవహరించి, నిందితులైన జవాన్లను సాధారణ న్యాయస్థానంలో విచారించడం సబబేనని తన వాదనగా చెప్పి ఉండాల్సింది.
సాయుధ దళాల చట్టం ఇలాంటి కేసుల్లో వర్తించబోదని స్పష్టంచేయాల్సింది. కనీసం కోర్టు మార్షల్ విచారణ అయినా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సింది. తమవారిని అకారణంగా పొట్టనబెట్టుకున్న జవాన్లకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయనే అభిప్రాయం కాశ్మీర్ పౌరుల్లో ఏర్పడితే, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి చేసే ప్రయత్నాలకు అది విఘాతం కలిగిస్తుంది. అంతేకాదు... ప్రపంచంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై సంశయాలు రేకెత్తిస్తుంది. ఇప్పటికైనా కేంద్రం మేల్కొనాలి. విస్పష్టమైన ఆధారాలున్నందువల్ల కోర్టు మార్షల్ నిర్ణయాన్ని రద్దుచేసి నిందితులను సాధారణ చట్టాలకింద న్యాయస్థానంలో విచారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి.