పొరుగు ముఖ్యమంత్రికి మినహాయింపులుంటాయా? | cms does have any exumtions in rare cases | Sakshi
Sakshi News home page

పొరుగు ముఖ్యమంత్రికి మినహాయింపులుంటాయా?

Published Tue, Jun 9 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

పొరుగు ముఖ్యమంత్రికి మినహాయింపులుంటాయా?

పొరుగు ముఖ్యమంత్రికి మినహాయింపులుంటాయా?

సందర్భం
 
రాజులకు ఎన్ని నేరాలైనా చేసే స్వేచ్ఛ ఉందనీ, ఏం చేసి నా ఏ శిక్షలూ ఉండవనే పాత యుగం వ్యవస్థ ఇంకా ఉందని ఎవరైనా అనుకుంటే అంతక న్నా దౌర్భాగ్యం లేదు.

రాష్ర్టపతి, గవర్నర్‌లకు మాత్రమే ఆర్టికల్ 361 కింద రాజ్యాంగం మినహాయింపు ఇస్తున్నది. బాధ్యతలు, విధుల నిర్వహణలో తమ పనుల వల్ల ఏదైనా హాని జరిగితే అందుకు రాష్ర్టపతి, గవ ర్నర్‌లు కోర్టుల్లో జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఈ అధికరణం తేల్చింది. వారి అధికారిక పదవీకాలంలో వారిపైన ఎటువంటి క్రిమినల్ కేసులూ పెట్టడానికి వీల్లే దని ఆర్టికల్ 361(2) వివరిస్తున్నది. పదవీకాలం ముగి సిన వెంటనే కేసులు రాకతప్పదని దీని అర్థం.  ముఖ్య మంత్రులూ వారి అనుయాయులూ తెలుసుకోవలసిం దేమంటే రాజ్యాంగం ఆర్టికల్ 361గానీ, మరే ఇతర చట్టాలుగానీ ముఖ్యమంత్రులకు ఏ మినహాయింపులు ఇవ్వలేదు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపైన కర్ణా టక జిల్లా నేరాల విచారణ  న్యాయస్థానం జైలు శిక్ష విధిం చిన సంఘటన ఏ ముఖ్యమంత్రికీ, ఏ మినహాయింపూ లేదని చాటుతున్నది.  

పోనీ ముఖ్యమంత్రిగా కాకపోయినా ఒక ఎంఎల్‌ఏ గా మినహాయింపు ఉండే అవకాశం ఏమైనా ఉందా అం టే జవాబు కచ్చితంగా ఉంటుంది. కానీ, ఏ మిన హాయింపు? రాజ్యాంగం ఆర్టికల్ 194(2) కింద అసెంబ్లీ చెప్పిన మాటకు, వేసిన ఓటుకు సంబంధించి ఏ కోర్టు లోనూ చట్టసభ సభ్యుడు జవాబు చెప్పనవసరం లేదు.

నోటు తీసుకుని సభలో ఓటు వేస్తే నేర విచారణ చేయడానికి వీల్లేదని పీవీ నరసింహారావు వర్సెస్ స్టేట్ (సీబీఐ) కేసులో సుప్రీంకోర్టు 1998లో తీర్పు చెప్పింది. ఇది ఒక రకంగా చాలా అన్యాయమైన తీర్పే. లంచాలు ఇచ్చిన వారికి శిక్షలు ఉంటాయంటూనే లంచాలు తీసు కుని చట్టసభలో ఓట్లేసిన వారిని విచారించడానికి వీల్లే దని మినహాయింపు ఇవ్వడం దారుణం. కానీ, ఆ దుర న్యాయ తీర్పు కూడా లంచాలు ఇచ్చిన ఎంఎల్‌ఏలకు, ఎంపీలకు మినహాయింపులు ఇవ్వలేదు. ఇచ్చిన వారికి విముక్తి లేదు కనుకనే ఎంఎల్‌ఏ రేవంత్‌రెడ్డిగారు లంచం ఇవ్వజూపి కెమెరాల్లో చిక్కి ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని హైదరాబాద్‌లో ఆం ధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 8 రక్షిస్తుందేమోనని కొందరు ఆశపడుతున్నారు. ఉమ్మడి రాజధాని హైదరా బాద్‌లో ఉన్న తెలంగాణేతర వ్యక్తుల ఆస్తిపాస్తులకు ప్రాణాలకు ఏదైనా ముప్పు ఏర్పడితే రక్షణకు గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు ఉంటాయనీ, శాంతి భద్రతల సమ స్యలు తలెత్తితే చర్యలు తీసుకునే అధికారాలు ఉంటా యనీ సెక్షన్ 8 వివరిస్తున్నదేగాని తెలంగాణేతరులు ఉమ్మడి రాజధానిలో హత్యలు, బందిపోట్లు, రేప్‌లు లం చాల నేరాలు యథేచ్ఛగా చేసుకోండి, పోలీసులు పట్టు కోరు అనే టోకు మినహాయింపులేవీ ఇవ్వలేదు. అటు వంటి మినహాయింపులు ఎవరికీ ఉండవు. ఒకవేళ ఉంటే  పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రే ఎందుకు, తెలంగాణేతరు లంతా తోచిన నేరాలు, ఘోరాలు చేసుకుంటూ జైలు భయం లేకుండా జీవించేవారు.  తమకు అటువంటి మినహాయింపులు ఉంటాయని ఎవరూ అనుకోవడం లేదు కూడా.

మరొక అనుమానం.. టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పొరుగు  ముఖ్యమంత్రిగారి ప్రైవసీ హక్కును ధ్వంసం చేశారనే ఆరోపణ. ఫోన్‌లు ట్యాప్ చేయడానికి వీల్లేదన్న మాట నిజం. అయితే ఏ సందర్భాలలో టెలిఫోన్‌లను  ట్యాప్  చేయొచ్చో సుప్రీంకోర్టు  పీయూసీఎల్ కేసులో స్పష్టం చేసింది. లంచం ఇవ్వబోతున్నారని తెలిసి నియ మిత శాసన సభ్యుడు స్టీఫెన్సన్ ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు ఏసీబీ ట్రాప్‌కు ఏర్పాట్లు చేసింది. అం దులో భాగంగా ఆ ఎంఎల్‌ఏ ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ను పరిశీలనలో పెట్టడం ద్వారా దొరికిన డేటాలోంచి సాక్ష్యా లు వెతుక్కోవడమే దర్యాప్తు, పరిశోధన అంటే.  

ప్రైవసీ సూత్రానికి నేర జీవితం ఒక మినహా యింపు. ఎవరైనా సరే ఎవరూ చూడకుండానే నేరాలు చేస్తారు, కానీ, ఎవరైనా చూస్తే నా ప్రైవసీ భంగపడిం దంటే చెల్లదు. అట్లా అయితే నేరాలు చూసిన ప్రత్యక్ష సాక్షులందరూ ప్రైవసీ ఉల్లంఘన నేరానికి జైల్లో  ఉండి పోతారు. నేరాలు చేసిన ఘరానా నిందితులంతా హాయి గా స్వేచ్ఛను అనుభవిస్తుంటారు. నేరాలను ప్రైవసీ పేరు తో రహస్యంగా దాచుకునే హక్కు ప్రపంచంలో ఏ చట్ట మూ ఇవ్వదు. నేరాలు చేశారని పోలీసులు  అనుమానిస్తే ప్రైవసీకి స్థానం ఉండదు. ట్రాప్‌లో భాగంగా టాపింగ్ కూడా ఉంటుంది.

మహిళల శరీరాలతో వ్యాపార నేరాలు చేసే వారిని, లంచాలు తీసుకునే వారిని ట్రాప్ ద్వారా పట్టుకోవడం చాలా సంవత్సరాల నుంచి అమలులో ఉన్న వ్యూహం. మరో రకంగా ఈ నేరగాళ్లను పట్టుకో వడం దాదాపు అసాధ్యం. అవినీతి నిరోధక చట్టంలో లేక పోయినా ట్రాపింగ్ అనే పదం అమలులో విస్తారంగా ఉంది. ట్రాపింగ్ చట్టబద్దమే అని అనేకానేక కేసుల్లో న్యాయస్థానాలు ప్రకటించాయి. స్టేట్ ఆఫ్ మహారాష్ర్ట వర్సెస్ రషీద్ బి ములాని కేసులో 2006లో సుప్రీంకోర్టు ట్రాపింగ్ చట్టబద్దతను పునరుద్ఘాటించింది. విచిత్రమే మిటంటే ట్రాపింగ్‌లన్నీ లంచం అడిగితీసుకునే ప్రభు త్వాధికారులను పట్టుకోవడానికి పట్టిన వలలే. కానీ, లంచం ఇచ్చినందుకు ప్రజా ప్రతినిధి వలలో చిక్కు కోవడం ఇదే మొదటిసారి. అందుకే రివర్స్ ట్రాప్ అంటున్నారు.

రికార్డయిన ఫోన్ మాటలు, వీడియో చిత్రాలు సాక్ష్యాలుగా పనికి వస్తాయా అనేది మరొక అనుమానం.  కోర్టులు ఎన్నో తీర్పుల్లో ఈ సాక్ష్యాలను అనుమతించి శిక్షలు విధించాయి. అయితే ఈ రికార్డులు మిమిక్రీతో అతికినవి కాదనీ, ఆడియో వీడియో టేపుల్లో అతుకులు కత్తిరింపులు లేవనీ, ఈ రికార్డు అసలైనదే అని ఫోరెన్సిక్ లేబొరేటరీలో రుజువైతే ఆ సాక్ష్యం తిరుగులేనిదవుతుం దని కోర్టులు నిర్ధారించాయి.  

అనిరుద్ధ బహల్ వర్సెస్ స్టేట్ కేసులో ఢిల్లీ హైకోర్టు  2010లో  మీడియా వారి స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన చిత్రాలను సాక్ష్యాలుగా అను మతించారు. బీఎండబ్ల్యూ కారును కాలి బాట మీద పడు కున్న బీదలపైకి ఎక్కించి చంపేసిన కేసులో పోలీసు సాక్షిని కొనడానికి లాయర్ లంచం ఇస్తుండగా ఒక ప్రైవేట్ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌తో బయట పెట్టింది. ప్రజాప్రయోజనం ఉన్న ఈ స్టింగ్ సరైనదే అని, సాక్ష్యం చెల్లుతుందని ప్రకటించి లాయర్‌ను కూడా శిక్షించింది సుప్రీంకోర్టు.

నేరం రుజువు కావడానికి సాక్ష్యాలు అవసరం. అభిప్రాయాలు కాదు, ఓట్లు కాదు. వ్యక్తి ఎవరనీ ఎంత గొప్పవాడనే స్థాయితో, హోదాతో సంబంధం లేకుండా రుజువులు ఉంటే చాలు నేరగాళ్లు జైలు పాలవుతారన్నదే సమన్యాయసూత్రం.

- మాడభూషి శ్రీధర్
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement