యూజీసీ... ఇది తగునా!
అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన విశ్వవిద్యాలయాలు తీసికట్టుగా ఉంటున్నాయని, మన దగ్గర పరిశోధనలకిచ్చే ప్రాధాన్యం తక్కువని ఆందోళన పడుతున్న వారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఈమధ్య జారీచేసిన మార్గదర్శకాలు కలవరం కలిగిస్తాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో వీటిపై నిరసనలు వ్యక్తం కావడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ఆ మార్గదర్శకాల్లో కొన్నిటిని వెనక్కు తీసుకోమని ఆదేశించవలసి వచ్చింది. మిగిలిన నిబంధనలు సైతం తమ ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని అధ్యాపకులు భావిస్తున్నారు.
విశ్వవిద్యాలయ అధ్యాపకుల బోధనా సమయాన్ని పెంచుతూ ఈ నెల 10న యూజీసీ ఈ మార్గదర్శకాలను జారీచేసింది. వీటికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా ఉంది. 2010నాటి మార్గదర్శకాల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ వారానికి 16 గంటలు, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌లు 14 గంటలపాటు బోధనలో నిమగ్నం కావ లసి ఉంటుంది. సవరించిన మార్గదర్శకాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ వారానికి 18 గంటలు, అసోసియేట్ ప్రొఫెసర్ 16 గంటలు బోధించాలని నిర్దేశించాయి. ప్రొఫె సర్ విషయంలో ఎలాంటి మార్పూ లేదు.
సైన్స్ అధ్యాపకులు రెండు గంటలపాటు ప్రాక్టికల్స్‌కు వెచ్చించాల్సి వస్తే దాన్ని ఒక గంట బోధనగా పరిగణిస్తామని కూడా ఆ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. పాత మార్గదర్శకాల్లో బోధన వేరు, ప్రాక్టికల్స్ వేరన్న భావన లేదు. ప్రాక్టికల్స్‌కు వెచ్చించే సమయాన్ని తక్కువగా పరిగణించడ మన్నది లేదు. ఇలా పని గంటల్ని పెంచడమే కాదు...పరిశోధనల్లో పాలు పంచుకోని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతి వారం విద్యార్థులకు అదనంగా ఆరు గంటలు ట్యుటోరియల్స్ నిర్వహించాలంటున్నది.
అంటే మొత్తంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వారానికి 24 గంటలు బోధనలో పాలుపంచుకోవలసి ఉంటుందన్న మాట! మన దేశంలో చాలా కళాశాలల్లో పరిశోధనకు సంబంధించిన మౌలిక వసతులు లేవు గనుక ఈ మార్గదర్శకాల ప్రకారం సహజంగానే ఎక్కువమంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు అధిక సమయాన్ని బోధనకు కేటాయించక తప్పని స్థితి ఏర్పడుతుంది. ఫలితంగా అరకొరగా జరిగే పరిశోధనలు సైతం మూలబడతాయి. అధ్యాపకులు పరిశోధనల్లో పాలుపంచుకోవడంవల్ల బోధనా ప్రమాణాలు పెరుగు తాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది.
పరిశోధనల్లో వెల్లడయ్యే అంశాలు నూతన ఆలోచనలకు దారితీస్తాయి. మన పొరుగునున్న చైనా ఈ అంశాల్లో ఎంతో ముందుంటున్నది. అందువల్ల ఏటా అక్కడినుంచి అధిక సంఖ్యలో పేటెంట్ల కోసం దరఖాస్తులు దాఖలవుతాయి. మన దేశం పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం. 2014లో చైనానుంచి పేటెంట్ దరఖాస్తులు 25,539 వస్తే... మన దేశంనుంచి దాఖలైనవి 1,394 మాత్రమే! ఈ గణాంకాలు మనం ఎంతగా ఎదగవలసి ఉన్నదో సూచిస్తున్నాయి.
ఒక వ్యవస్థలోని విభాగాల మధ్య సమన్వయం కోసం, అవి సమర్ధవంతంగా పనిచేయడం కోసం, వాటి ప్రమాణాలు పెంచడం కోసం దేనికైనా ఒక నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఎక్కువ సందర్భాల్లో ఆ వ్యవస్థల్ని చూసే వారు నియంత్రణను నియంతృత్వంగా పొరబడుతున్నారు. తమకిష్టం వచ్చిన రీతిలో మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించి ‘అమలు చేస్తారా... చస్తారా’ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. యూజీసీ అందుకు మినహాయింపు కాదని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. యూనివర్సిటీల్లోనూ, కళాశాలల్లోనూ జరిగే బోధనకు సంబంధించి ప్రాథమిక అవగాహన ఉన్నవారెవరూ ఇలాంటి మార్గదర్శకాలుజారీ చేయరు.
నిజానికి అధ్యాపకులకు బోధన, పరిశోధనవంటివి మాత్రమే కాదు... విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంతోసహా పాలనాపరమైన ఇతర బాధ్యత లుంటాయి. పైగా తరగతి గదిలో బోధించదల్చుకున్న అంశాన్ని అధ్యయనం చేయడానికి అధ్యాపకులకు కొంత సమయం అవసరమవుతుంది. పనిగంటల్ని పెంచడంలో అత్యుత్సాహం ప్రదర్శించినవారికి ఇలాంటి అంశాలపై స్పష్టత లేదని అర్ధమవుతుంది.
యూజీసీ యధాలాపంగా ఈ కొత్త మార్గదర్శకాలు ఇచ్చినట్టు...అధ్యాపక లోకం ఆందోళన గమనించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాటిని వెనక్కు తీసుకున్నట్టు కనబడుతున్నా వీటి తల్లి వేళ్లు వేరేచోట ఉన్నాయి. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో యూజీసీకిచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 55 శాతం కోతపెట్టింది. ఆ కోతను పూడ్చుకోవడానికి ఏం చేద్దామా అని యూజీసీ చేసిన ఆలోచనల పర్యవసానంగానే తాజా మార్గదర్శకాలు వెలువడ్డాయని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. ఒక విద్యా సంవత్సరంలో నిర్దిష్టమైన కోర్సును పూర్తి చేయడానికి ఎన్ని బోధనా గంటల సమయం పడుతుందో నిర్ణయించి ఆ ప్రాతిపదికన ఏ విశ్వవిద్యాలయమైనా అధ్యాపకులను తీసుకుంటుంది.
తాజా మార్గదర్శకాలు అధ్యాపకుల బోధనాకాలాన్ని పెంచడంవల్ల కొత్తవారిని ఆ పోస్టుల్లో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా ఉన్నవారే భారమనిపిస్తారు. తాత్కాలిక పోస్టుల్లో ఉన్నవారిని ఇంటికి పంపించే ఏర్పాటు చేయవచ్చు. ఆ రకంగా అధ్యాపకులకిచ్చే జీతభత్యాల బడ్జెట్ తగ్గుతుంది. అధికారంలో ఉన్నవారికైనా, యూజీసీ నిర్వాహకులకైనా ఇది న్యాయం అనిపిస్తోందా? విశ్వవిద్యాలయాల నిర్వహణను ఆర్ధిక బెడదగా భావించడం, అక్కడి ప్రశ్నించే తత్వాన్ని ధిక్కారంగా పరిగణించడం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు.
2009లో సైతం అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో అధ్యాపకులపై యూజీసీ ఈ మాదిరే ‘దాడి’ చేసింది. మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పెరగాలని... బోధనలోనూ, పరిశోధనల్లోనూ మేటిగా ఉండాలని...సృజనాత్మకత వెల్లివిరి యాలని... అవి మరింత జవాబుదారీతనం అలవర్చుకోవాలని... అక్కడ అవినీతి ఉండకూడదని ఆశించడం తప్పేమీ కాదు. విద్యారంగ నిపుణుల్ని, అధ్యాపక వృత్తిలో ఉంటున్నవారిని పిలిపించి ఇలాంటి అంశాల్లో ఇంకేమి చేయవచ్చునో చర్చించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంతేతప్ప ఖర్చు తగ్గించుకుందామని కోతలు విధించి... పరిశోధనలు సరిగా లేవన్న కారణంతో వాటిని ఆపించి ఉన్నత విద్యారంగాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో అర్ధంకాదు. విశ్వవిద్యాలయాల ప్రమాణాలను పెంచడానికి ఇది మార్గం కాదు.