మగస్వామ్యంలో ‘ఒక్క మొగాడు’ | Democracy state one and only man | Sakshi
Sakshi News home page

మగస్వామ్యంలో ‘ఒక్క మొగాడు’

Published Tue, Apr 15 2014 2:21 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

మగస్వామ్యంలో ‘ఒక్క మొగాడు’ - Sakshi

మగస్వామ్యంలో ‘ఒక్క మొగాడు’

ములాయం వెర్రివాడు కాడు. ఎన్నికల లెక్కల్లో ఆరితేరిన కిలాడి. ఎన్నికల వేళ నిర్భయ చట్టాన్ని మారుస్తానని అన్నాడంటే దానికో లెక్కుండే ఉండాలి. అది ఓట్ల వాన కురిపించే మ్యాజిక్కే అయి ఉండాలి.
 
మన నేతల్లో ఒక్కడైనా అసలు సిసలు ‘మగాడు’న్నాడు. మగాళ్లు ‘మగాళ్లే’నంటూ భ్రమర-పుష్ప న్యాయాన్ని’ పబ్లిగ్గా చాటాడు. ‘కుర్రాళ్లన్నాక తప్పులు (అత్యాచారాలు) చేస్తారు. అంత మాత్రాన మరణ శిక్షలు వేసేస్తారా?’అనే సమాజ్‌వాదీ అధినేత ఆవేదనను అర్థం చేసుకోలేని మీడియా కాకిగోల, ఆడోళ్ల అల్లరి. ములాయం దడుస్తాడా, నాలుక మడుస్తాడా? మాట మీద నిలబడ్డాడు. ఈ గోలకు నిద్రాభంగమైన మాజీ ప్రధాని దేవెగౌడ ములాయం వాక్ స్వేచ్ఛను హరిస్తున్న వాళ్లు నోళ్లు మూయాలని రూలింగ్ ఇచ్చారు. ‘ములాయం రేప్’ను ఖండించేది లేదన్నారు. ములాయం మహిళా పక్షపాతి కాబట్టి రేప్‌ను ‘తప్పు’ అన్నారు. కానీ అది సహజ ‘మగ’ ధర్మం కాదా? మగాళ్లన్నాక ఆడాళ్లకు ఆకర్షితులు కారా? ‘ప్రకృతి’ గతి తప్పుతుందా? ఆ తప్పనిదే, ‘తప్పు’ అనరానిదే ప్రేమ లేదా ఇష్టం. అవునంటే ప్రేమ, కాదంటే రేప్. శక్తి మిల్లు కుర్రకారు ‘సరదా’ ప్రదర్శించిన ముప్పయి అంచుల్లోని ఆ ముగ్గురు ‘పిల్లలకు’ సామూహిక అత్యాచార వ్యసనమే. అంత మాత్రాన చంపేస్తారా? గురువుకు తగ్గ శిష్యుడు అబూ ఆజ్మీ... పరస్పర ఇష్టంతో లేక బలవంతంగా వివాహేతర లైంగిక సంబంధంలో ఉన్న మహిళలను కూడా ఉరి తీయాలని సెలవిచ్చారు. ములాయం, అజాం విమర్శ కులు పొరబడుతున్నారు. అత్యాచారాలకు అసలు కారణం ఆడాళ్ల వేష భాషలేనని కుల, మతాలకు అతీతంగా ఎందరు విజ్ఞులు నిర్భయ కేసులో తీర్పు చెప్పలేదు?
 
మనమంతా లేనిది ఉన్నట్టుగా భ్రమించే వ్యాధి బాధితులం కావడమే అసలు సమస్య. ఇద్దరో ముగ్గురో మహిళలు ముఖ్యమంత్రులైనంత మాత్రాన, మహిళలకు దిగదుడిచి ఒకటో అరో మంత్రి పదవులు పడేసినంత మాత్రాన స్త్రీ,పురుష అంతరాల గోడ కూలిందనుకుంటే ఎలా? ప్రధానిగా ఇందిర కొమ్ములు తిరిగిన మగాళ్లతో మూడు చెరువుల నీళ్లు తాగించారంటారా? ఆమెకు ఆ స్థానం దక్కింది నెహ్రూ కూతురిగానే. రేపటి ‘ప్రధానుల’ జాబితాలోని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేటికీ ఎమ్జీఆర్ బొమ్మ పెట్టుకోక తప్పదు. ఇక ములాయంకు పక్కలో బల్లెం, బీజేపీ, కాంగ్రెస్‌ల పాలిటి కాల్చే నిప్పు, ముంచెత్తే ముప్పు మాయావతి... కాన్షీరాం వారసురాలు. మగ ‘గోడ చేర్పు’ లేని నేత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరున్నారేమో. ఆమె రేపిస్టుల తరఫున బహిరం గంగా వకాలతు పుచ్చుకున్న ఏకైక సీఎం! అయినా మొగు డితో తన్నులు తినే మహిళా మంత్రులు ఎందరు లేరు? ఐక్య రాజ్యసమితి తాజా మానవాభివృద్ధి నివేదికను ఒక్కసారి చూడండి. లైంగిక సమానత్వంలో మనది 186 దేశాల్లో 136వ స్థానం. నిన్నటి ‘ఢిల్లీ బస్సు తప్పు’ నుంచి నేటి హైదరాబాద్ పాత బస్తీ చిన్నదాని ప్రేమ నిరాకరణ ‘చిన్న తప్పు’ వరకు గోల చేస్తున్న వాళ్లందరి నోళ్లు మూగపోవ డానికి ఇది చాలు. దక్షిణ ఆసియాలో మహిళల పరిస్థితి మన కంటే అధ్వానంగా ఉన్నది ఒక్క అఫ్ఘానిస్థాన్‌లోనే. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ సైతం మనకంటే నయమే.
 మహిళా రిజర్వేషన్లు బూజు పట్టి పోతున్నది ఊరికే కాదు. మహిళా కోటా ‘ప్రజాస్వామ్యానికి’ డేంజర్ అని పబ్లిగ్గా చెప్పింది ఒక్క ములాయమే.

రేపు ఢిల్లీ గద్దెపై ఏ మగాడు కూచోవాలో తేల్చే ముగ్గురు ‘మూలపుటమ్మలు’ ‘ములాయం రేప్’ను ఎందుకు ఖండించలేదు? కాంగ్రెస్, బీజేపీల్లోని సత్రకాయ నేతలు తప్ప మరెవరూ నోరు విప్ప లేదేం? ములాయం వెర్రివాడు కాడు. ఎన్నికల లెక్కల్లో ఆరి తేరిన కిలాడి. ఎన్నికల వేళ నిర్భయ చట్టాన్ని మారుస్తానని అన్నాడంటే దానికో లెక్కుండే ఉండాలి. అది ఓట్ల వాన కురిపించే మ్యాజిక్కే అయి ఉండాలి. సినిమా చరిత్రలో ఎవర్‌గ్రీన్ బాక్స్ ఆఫీస్ హిట్ ఫార్ములా ఒక్కటే... ఈవ్ టీజింగ్! కీచకుల్లాంటి హీరోలను ఆడామగా విరగబడి మరీ చూడ్డంలేదా? ఇది మగాళ్ల లోకం. ఢిల్లీ బస్సు తప్పు సంద ర్భంగా లేచిన ఆడ కల్లోలం, నిర్భయ చట్టం మగస్వామ్యా నికి తెచ్చిన ముప్పును గ్రహించారు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. అజాం నియోజక వర్గం వెళ్లి చూడండి గాలి ఎటు వీస్తోందో!  మరో మాట పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, హింసలో అగ్రస్థానం యూపీదే. అక్కడి ప్రతి మహిళా ఆడది పని చేయడమంటే మగాడి ‘కంట్లో’ పడటమేననే చెబుతుంది. అందుకే ఇంటిపట్టునే ఉండాలని సంఘ్ నేత మోహన్ భాగవత్ ఢిల్లీ బస్సు తప్పునాడే చెప్పారు. ములాయం లౌకికవాదం, భాగవత్ మతతత్వం అంతా మిథ్య. మనది మగస్వామ్యం, మగ ప్రజాస్వామ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement